శిశువు మృతుకి కారణమైన వైద్యుడిని తొలగించాలి
వైఎస్సార్‌సీసీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్
ఎన్టీఆర్ ఆస్పత్రి వద్ద శిశువు కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా
అనకాపల్లి: చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం, వైద్యుల కొరత, విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో మూడురోజుల శిశువు మృతి చెందిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ఆరోపించారు. ఆస్పత్రిలో ఈనెల 3వ తేదీ రాత్రి వైద్యుల కొరత, విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా కశింకోటలోని గవరపేట వీధికి చెందిన వేగి శ్రీనివాసరావు, తులసి దంపతుల మూ డు రోజుల శిశువు మృతిచెందిన విషయం తెలిసిందే. శిశువు మృతికి కారణాలు బహిర్గతం చేయాలని, మరణానికి కారణమైన వైద్యుడిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి ఆవరణలో శనివారం వైఎస్సార్‌సీపీ నాయకులు, శిశువు కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ నిరుపేద రోగులు చికిత్స పొందే ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన సదుపాయాలు కల్పించకపోవడం అన్యాయమన్నారు.శిశువు మృతి ప్రభుత్వ హత్యగానే భావిస్తున్నామని, ప్రభుత్వ నిర్లక్ష్యం, విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడం తదితర కారణాలతోనే శిశువు మృతిచెందిందని చెప్పా రు. మృతికి గల కారణాలు సూపరింటెండెంట్‌కు తెలిసినప్పటికీ నోరు మెదపడం లేదన్నారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆస్పత్రి వైద్యులు లేరని, ఎస్‌ఎన్‌సీయూ వార్డు లో శిశువును పరీక్షించేందుకు వైద్యులు లేరని సూపరింటెండెంట్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అనారోగ్యానికి గురైన శిశువును ఉదయం 9.30 గంటలకు చిన్నపిల్లల వైద్యుడికి చూపించగా ఏమీ పరవాలేదని చెప్పారని, మధ్యాహ్నం పరిస్థితి విషమించడంతో చికిత్స చేయడానికి వైద్యుడు లేకపోవడం వల్లే మరణించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో జరిగిన అన్నివిషయాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని తెలిపారు. మాజీ ఎంపీ బి.వి. సత్యవతి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆస్పత్రి వైద్యులు ఓ మాతృమూర్తికి తీవ్ర అన్యాయం చేశారన్నారు.సరైన పద్ధతిలో బిడ్డకు పాలు ఇవ్వకపోవడం వల్లే ఊపిరితిత్తుల్లోకి చేరి మరణించినట్టు చిన్నపిల్లల వైద్యులు చెప్పడం దారుణమన్నారు. డీసీహెచ్‌ఎస్, సూపరింటెండెంట్ న్యాయం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మలసాల కుమార్‌రాజా, ఆస్పత్రి మాజీ డైరెక్టర్ మూనూరు శ్రీను, వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు దండా జ్ఞానదీప్, 80,81,84 వార్డుల ఇన్‌చార్జ్‌లు కె.ఎం.నాయుడు, బి.శివ, కె.రాఘవ, మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు మర్రిపల్లి శోభ, ఎంపీపీ గొర్లి సూరిబాబు, పార్టీ సీనియర్ నాయకులు కొణతాల మురళీకృష్ణ, బుదిరెడ్డి దేముడుబాబు, కలగలక్ష్మిగున్నయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.


