బాధితుల గొంతునొక్కి..మిట్టల్‌ ఉక్కు భూమిపూజ | - | Sakshi
Sakshi News home page

బాధితుల గొంతునొక్కి..మిట్టల్‌ ఉక్కు భూమిపూజ

Mar 24 2026 7:50 AM | Updated on Mar 24 2026 7:50 AM

పలువురు గృహ నిర్బంధం

రాజయ్యపేటలో మిట్టల్‌

స్టీల్‌ప్లాంట్‌కు భూమిపూజ

విధులన్నీ పక్కన పెట్టి

సభ ఏర్పాట్లలో అధికారులు

బస్సులన్నీ బహిరంగ సభకే

పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు

తీవ్ర ఇబ్బందులు

నక్కపల్లి : నక్కపల్లి మండలం రాజయ్యపేట, చందనాడ సమీపంలో ఆర్సిలర్‌ మిట్టల్‌ నిప్పన్‌ ఇండియా లిమిటెడ్‌ ఆధ్వర్యంలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి సోమవారం భూమిపూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అఽధికార యంత్రాంగాన్ని పూర్తిగా వాడుకుంది. అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసింది. ప్రభుత్వ శాఖల సిబ్బంది అంతా తమ విధులను పక్కన పెట్టి భూమి పూజ, బహిరంగ సభకు జన సమీకరణలోనే నిమగ్నమయ్యారు. ఇందుకు ఆర్‌టీసీ బస్సులను అధిక సంఖ్యలో కేటాయించింది. బస్సులన్నీ భూమిపూజ కార్యక్రమానికి కేటాయించడంతో పదోతరగతి పరీక్షలకు వెళ్లే విద్యార్థులు, ఇతర ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. బస్సుల కోసం మండుటెండలో పాయకరావుపేట, నక్కపల్లి, అడ్డురోడ్డు తదితర ప్రాంతాల్లో ప్రయాణికులు ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది.

ప్రొటోకాల్‌ ఉల్లంఘన

స్టీల్‌ప్లాంట్‌ భూమి పూజ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులకు ఆహ్వానం అందలేదు. భూములు సేకరించిన గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, మండల స్థాయి ప్రజాప్రతినిధులకు ఆహ్వానపత్రాలు వాట్సాప్‌ల ద్వారానే పంపించారు. వారిని కనీసం స్టేజి మీదకు పిలిచే ప్రయత్నం కూడా చేయకపోవడంతో విమర్శలు తలెత్తాయి.

కూటమిలో పాసుల గోల..

బహిరంగ సభ వద్దకు వెళ్లేందుకు వీవీఐపీ, వీఐపీ పాస్‌లు వేల సంఖ్యలో జారీ చేశారు. ఈ పాసుల్లో ఎక్కువ టీడీపీ కార్యకర్తలు, నాయకులకే ఇచ్చారని, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులకు ఇవ్వలేదంటూ ఆయా పార్టీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బహిరంగ సభకు వెళ్లే అన్ని మార్గాల్లో వందల సంఖ్యలో టీడీపీ నాయకులు స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. వాటిలో కూడా బీజేపీ, జనసేన నాయకులకు తగినంత ప్రాధాన్యం ఇవ్వలేదు. టీడీపీ నాయకులే గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ఆహ్వాన పత్రాలు పంపిణీ చేశారు.

సభ పూర్తి కాకుండానే వెళ్లిపోతున్న ప్రజలు

నిర్వాసితులపై ఆంక్షలు

స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి భూములు త్యాగం చేసిన నిర్వాసితులను కూటమి ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేసింది. భూసేకరణ సమయంలో ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కింది. డీ ఫారం రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వలేదు. నివాస ప్రాంతాలు ఖాళీ చేసిన వారికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వలేదు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసింది. బాధితులు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద రూ.25 లక్షలు కోరితే కేవలం రూ.8.98 లక్షలు చొప్పున మాత్రమే ఇచ్చింది. ఈ సమస్యలపై భూమిపూజ సందర్భంగా బాధితుల తరపున గళం వినిపించకుండా కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. బహిరంగ సభ వేదిక వద్దకు ప్రతిపక్ష పార్టీ నాయకులు, బాధితుల తరపున పోరాటం చేస్తున్న వారినెవరినీ రాకుండా అడ్డుకుంది. నిర్వాసితులకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న సీపీఎం, సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ నాయకులను గృహనిర్బంధం చేసింది. సీపీఎం జిల్లా కార్యదర్సి ఎం.అప్పలరాజు, మండల కన్వీనర్‌ ఎం.రాజేష్‌లను ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులను కాపలా ఉంచింది. మత్స్యకారులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని కోరుతున్న మత్స్యకారులను రాజయ్యపేటలోనే గృహనిర్బంధం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement