కొంతకాలం ఓపిక పట్టండి.. | - | Sakshi
Sakshi News home page

కొంతకాలం ఓపిక పట్టండి..

Mar 24 2026 7:50 AM | Updated on Mar 24 2026 7:50 AM

● ఉక్కు ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం ● కార్మిక సంఘాల సమావేశంలో కేంద్ర మంత్రి కుమారస్వామి

కేంద్ర మంత్రులకు వినతిపత్రం అందజేస్తున్న

కార్మిక నాయకులు

ఉక్కునగరం: కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వచ్చారు.. స్టీల్‌ప్లాంట్‌ను చూశారు.. సమస్యలు విన్నారు.. అన్నింటికీ ఓపిక పట్టాలని చెప్పి వెళ్లిపోయారు. ఇదీ సోమవారం కేంద్ర మంత్రుల పర్యటన స్థూల సారాంశం. నక్కపల్లిలో ఆర్సెలార్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ ఇండియా ప్లాంట్‌ శంకుస్థాపనకు వచ్చిన మంత్రులు శనివారం రాత్రి స్టీల్‌ప్లాంట్‌లో బస చేశారు. ఉన్నత యాజమాన్యంతో సమీక్ష నిర్వహించారు. వారి పర్యటనతో తమ పెండింగ్‌ జీతాలు, ప్రతీ నెలా పూర్తి జీతం, ఆర్థిక ప్రయోజనాల పునరుద్ధరణ జరుగుతుందని ఉద్యోగులు ఆశపడ్డారు. అయితే వారు ఎటువంటి హామీ ఇవ్వకుండా కొంత కాలం ఓపిక పట్టండి అంటూ చెప్పి ఉద్యోగులను నిరాశలో ముంచెత్తారు.

కార్మిక సంఘాల నాయకులతో సమావేశం

పర్యటనలో భాగంగా మధ్యాహ్నం మంత్రులు కార్మిక సంఘాలు, ఉక్కు అధికారుల సంఘం (సీ), ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సంఘాలతో సమావేశం నిర్వహించారు. పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని, ప్రతీ నెలా పూర్తి జీతాలు చెల్లించాలని, కాంట్రాక్ట్‌ కార్మికుల ఆధార్‌ బ్లాక్‌ తొలగించాలని, ప్లాంట్‌ పూర్తి స్థాయిలో నడపడానికి ఆరవ బ్యాటరీ నిర్మించాలని, సింటర్‌ ప్లాంట్‌ సామర్థ్యం పెంచాలని నాయకులు కోరారు. దీనిపై కేంద్ర మంత్రి కుమారస్వామి మాట్లాడుతూ గత ఏడాదిలో ఉక్కు ఉద్యోగులు చేసిన కృషి అభినందనీయమని, ఊహించిన దాని కన్నా అధికంగా ఉత్పత్తి సామర్థ్యం చూపారని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం రూ.8 వేల కోట్లతో రెండో ప్యాకేజీ ఇచ్చే అంశం ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలో ఉందన్నారు. కొద్దికాలం ఓపిక పడితే ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. సమావేశంలో అఖిపక్ష నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement