దేవరాపల్లి : మంచు తెగుళ్లు, అకాల వర్షానికి నష్టపోయిన జీడి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని లేకుంటే ఆత్మహత్యలే శరణ్యమని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని వాలాబు పంచాయతీలో గిరిజన జీడి రైతులు అర్ధనగ్న ప్రదర్శనలో మెడకు ఉరి తాళ్లు బిగించుకొని వినూత్న నిరసన కార్యక్రమాన్ని సోమవారం చేపట్టారు. వీరికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వెంకన్న, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి.టి.దొర మద్దతు ప్రకటించారు. ఈ ఏడాది అకాల వర్షాలు, మంచుతో జీడి పంటలు పూర్తిగా నాశనమయ్యాయని, జీడి పంటపై ఆధారపడిన రైతులంతా అప్పులు పాలయ్యారన్నారు. ఎకరా జీడి పంటకు రూ. 30 వేలు చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అరకొరగా దిగుబడి వచ్చే జీడి పిక్కలకు కేజీకి రూ. 200 చొప్పున మద్దతు ధర ప్రకటించి రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, పంటల బీమా ప్రభుత్వమే ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యానవన అధికారులు మొద్దు నిద్ర వీడి గ్రామాల్లో జీడి పంట నష్టాన్ని గుర్తించాలని హితవు పలికారు. నిరసనలో సిహెచ్.లక్ష్మణ, కాకి ఈశ్వరరావు, కె.సుధాకర్, సిహెచ్.చినదేముడు, బి.నాగేశ్వరరావు, ఈ.గోపాలుడు తదితరులు, గిరిజన జీడి రైతులు పాల్గొన్నారు.


