న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026
పది పరీక్షలకు
● రేపటి నుంచి ప్రారంభం
● జిల్లాలో కేంద్రాలు : 102
● పరీక్షలు రాసే విద్యార్థులు : 21,016
● ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు : 14,307
● ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులు : 6,268
● సప్లిమెంటరీ విద్యార్థులు : 441
సాక్షి, అనకాపల్లి: జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈనెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 262, ప్రైవేట్ పాఠశాలలు 138 నుంచి 21,016 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల నుంచి 14,307 మంది, ప్రైవేట్ పాఠశాలల నుంచి 6,268 మంది విద్యార్థులున్నారు. కంపార్ట్‌మెంట్ పరీక్షలు రాసే విద్యార్థులు 441 మంది ఉన్నారు. వీరి కోసం 102 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఓపెన్ స్కూల్ పదవ తరగతి పరీక్షలను ఈనెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1 వరకూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. జిల్లాలో 71 ఓపెన్ స్కూళ్లు ఉండగా.. 846 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
పర్యవేక్షణకు 400 మంది నియామకం
పదో తరగతి పబ్లిక్ పరీక్షల పర్యవేక్షణకు మొత్తం 400 మందిని అపాయింట్ చేశారు. 102 పరీక్ష కేంద్రాలకు 102 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 102 మంది డిపార్టుమెంట్ ఆఫీసర్లు, ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్స్, 28 సిటింగ్స్ స్క్వాడ్‌లను నియమించారు. 1079 మందిని ఇన్విజిలేటర్లుగా నియమించారు.
సమస్యాత్మక పరీక్ష కేంద్రాలు
జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు 8 సమస్యాత్మక పరీక్ష కేంద్రాలుగా జిల్లా విద్యాశాఖ అధికారులు గుర్తించారు. నాతవరం జెడ్పీహైస్కూల్, రావికమతం జెడ్పీహైస్కూల్, పాల్తేరు జెడ్పీ హైస్కూల్, సబ్బవరం మండలం రావులంపాలెం హైస్కూల్, గొలుగొండ ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ స్కూల్, కోనాం ఏపీఆర్‌ఎస్ స్కూల్‌తో పాటు మరో రెండు కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఈ పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి చూచి రాతలు మాస్ కాపీయింగ్ జరగకుండా సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు పరీక్షలు పూర్తయ్యే వరకు సిట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు.
కలెక్టర్ విజయకృష్ణన్
ఈ వస్తువులకు అనుమతి లేదు
విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్, క్యాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లడానికి అనుమతి లేదు. పరీక్ష కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు ఉన్న జిరాక్స్ సెంటర్లు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసి ఉండాలి. కేంద్రాల వద్ద బీఎన్‌ఎన్ 163 అమలులో ఉంటుంది. అత్యవసర సమాచారం కోసం జిల్లా విద్యాశాఖ హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసింది.
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు సర్వీసుల్లో ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించింది. విద్యార్థులు హాల్ టికెట్లు చూపించి బస్సు సర్వీసులో ఉచిత ప్రయాణాన్ని పొందవచ్చు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆర్టీసీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.


