సాక్షి, అనకాపల్లి : తాండవ– ఏలేరు కాలువ అనుసంధానం పనులను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసి, ఎత్తిపోతల పథకం తెస్తామంటూ రైతులను మభ్య పెడుతోంది. నాడు దివంగత నేత వైఎస్సార్ హయాంలో తాండవ నది సాగునీటి కాలువకు రూ.65 కోట్లతో సిమెంట్ లైనింగ్ పనులు చేసి రైతులకు దన్నుగా నిలిచారు. మళ్లీ ఆయన తనయుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో వేలాది మంది ఆయకట్టు రైతులకు మేలు చేకూరేలా ఏలేరు కాలువ– తాండవ ప్రాజెక్టు అనుసంధానం కోసం రూ.470 కోట్ల 5 లక్షలు మంజూరు చేశారు. 2022లో డిసెంబర్‌లో నర్సీపట్నంలో శంకుస్థాపన కూడా చేశారు. ఇది పూర్తయితే అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం, పాయకరావుపేట నియోజకవర్గాలు, కాకినాడ జిల్లాలో తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల రైతులకు సాగునీటి కష్టాలు తీరనున్నాయనే ఆశతో సంబరాలు చేసుకున్నారు. కాకినాడ జిల్లాలో ఏలేశ్వరం ప్రాజెక్టు నుంచి అదనపు నీటిని కాలువ ద్వారా తరలించేందుకు అదనపు భూమి సేకరణను ఇరిగేషన్ అధికారులు చేపట్టారు. ఈ భూసేకరణకు అప్పట్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సుమారుగా రూ.10 కోట్లు విడుదల చేసింది. అంతేకాకుండా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో అనుసంధానం పనులకు సంబంధించి ఏలేరు– తాండవ కాలువలను ఇరిగేషన్‌శాఖ ఈఎన్‌సీ, నార్త్ కోస్ట్ సీఈతో పాటు ఇతర ఇంజినీరింగ్ అధికారులు స్వయంగా పరిశీలన చేశారు. పనులు ప్రారంభించే సమయంలో కాంట్రాక్టర్ బిల్లుల కోసం కాసింత జాప్యం చేశారు. ఈ అనుసంధానం పనులను కేఎంకే కంపెనీకు చెందిన కాంట్రాక్టర్ దక్కించుకున్నారు. ఆ తరువాత ఎన్నికలు రావడంతో పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఆ తరువాత చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తాండవ– ఏలేరు అనుసంధానం పనులకు బ్రేక్ పడింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే రెండు జిల్లాలో నాలుగు నియోజకవర్గాల రైతులకు మేలు జరుగుతుంది. అయితే వైఎస్సార్‌సీపీకి మంచి పేరు వస్తుందనే అక్కసుతో కూటమి నేతలు ప్రాజెక్టు ఆపించేసేందుకు కుట్రలు పన్నారు. కేవలం 25 శాతం పనులు కూడా పూర్తి చేయలేదనే కారణంగా పూర్తిగా రద్దు చేసింది. ఈ పనుల రద్దుపై రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయంతో నర్సీపట్నంకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధి, స్పీకర్ అయ్యన్నపాత్రుడు పోలవరం కాలువ నుంచి తాండవ ఎత్తిపోతల పథకం తెస్తానంటూ హామీ ఇచ్చారు.
5,465 ఎకరాల ఆయకట్టు రైతులకు మేలు
●ఏలేరు జలాశయం తూర్పు గోదావరి జిల్లాలో ఏలేశ్వరం వద్ద 24 టీఎంసీల సామర్థ్యంతో 1991 సంవత్సరంలో నిర్మించిన జలాశయం. రోజుకు 730 లక్షల గ్యాలన్ల చొప్పున ఏలేరు ఎడమ కాలువ ద్వారా విశాఖ స్టీల్‌ప్లాంట్ అవసరాలను తీరుస్తోంది. గోదావరి నదిపై పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పూర్తయిన తర్వాత పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ఈ జలాశయానికి తరలిస్తుండడంతో జలకళ కనిపిస్తోంది!
●తాండవ జలాశయం అనకాపల్లి జిల్లాలో గొలుగొండ మండలంలో 1965లో నిర్మించిన జలాశయం. 4.96 టీఎంసీల సామర్థ్యం ఉన్నప్పటికీ క్యాచ్‌మెంట్ ఏరియాలో తగిన వర్షాలు లేక నిండుకుండలా కనిపించిన సందర్భాలు చాలా అరుదు.
●జిల్లాలోనున్న శ్రీరాజా సాగి సూర్యనారాయణరాజు తాండవ జలాశయం కింద వాస్తవ ఆయకట్టు 51,465 ఎకరాలు. ఇందులో 32,689 ఎకరాలు అనకాపల్లి జిల్లాలో, మిగతా 18,775 ఎకరాలు కాకినాడ జిల్లాలో ఉన్నాయి. తాండవకు 448 చదరపు కిలోమీటర్ల క్యాచ్‌మెంట్ ఏరియా ఉంది. కానీ ఆ ప్రాంతంలో వర్షాలు తగ్గిపోతున్నాయి. ఇటీవల ఎక్కువగానే పడినప్పటికీ కొన్నేళ్లుగా తగ్గిపోతువస్తున్నాయి. గత పదిహేనేళ్ల కాలంలో గత ఖరీఫ్ సీజన్‌లోనే నిండుకుండలా కళకళలాడింది. 380 అడుగుల మేర నీటినిల్వ (ఎఫ్‌ఆర్‌ఎల్) సామర్థ్యం ఉన్న ఈ జలాశయం పూర్తిగా నిండిన సందర్భాలు చాలా అరుదు. దీంతో ఇటు అనకాపల్లి జిల్లాలోను, అటు కాకినాడ జిల్లా మెట్ట మండలాల్లోని టెయిల్ ఎండ్ భూములకు సాగునీరు అందట్లేదు. సకాలంలో సాగునీరు అందక జిల్లాలోని నాతవరం, నర్సీపట్నం, కోటవురట్ల, పాయకరావుపేట మండలాల్లోను, తూర్పు గోదావరి జిల్లాలోని కోటనందూరు, తుని, రౌతులపూడి మండలాల్లో నీటి సమస్య కారణంగా పంటలకు నష్టం వాటిల్లుతోంది. ఆయా మండలాల్లోని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తప్పట్లేదు. ఈ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న రౌతులపూడి మండలానికి చెందిన సినీనటుడు ఆర్.నారాయణమూర్తి తొలుత స్పందించారు. ఏలేరు–తాండవ అనుసంధానం ద్వారా తాండవ ఆయకట్టును స్థిరీకరించి రైతులను ఆదుకోవాలని అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆయన జలవనరుల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
చంద్రబాబు ప్రభుత్వంతో రైతులకు అన్యాయమే..
మా ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఏలేరు–తాండవ అనుసంధానం వల్ల రెండు జిల్లాల రైతులకు మేలు జరుగుతుంది. కేవలం మా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అక్కసుతో రైతులకు కూటమి నేతలు అన్యాయం చేస్తున్నారు. 25 శాతం పనులు పూర్తికాలేదనే నెపంతో ఈ అనుసంధానం ప్రాజెక్టును రద్దు చేసింది ఈ ప్రభుత్వం. రైతులకు తీవ్ర అన్యాయం చేసింది. స్పీకరు అయ్యన్నపాత్రుడు పోలవరం తాండవ ఎత్తిపోతల పథకం ఇస్తామని బహిరంగ సభలో హామీ ఇచ్చారు. ఎప్పుడు నేరవేర్చుతారో రైతులకు చెప్పాలి. కూటమి ప్రభుత్వం చేస్తున్న గిమ్మిక్కులను ప్రజలు గమనిస్తున్నారు.
– పెట్ల ఉమా శంకర్ గణేష్,
మాజీ ఎమ్మెల్యే
తాండవ–ఏలేరు అనుసంధానం కలేనా..?
రూ.470.5 కోట్లు మంజూరు చేసిన గత సర్కార్
నాడే భూసేకరణ, టెండర్ ప్రక్రియ పూర్తి
దాదాపుగా రూ.10 కోట్ల వరకూ ఖర్చు
వైఎస్సార్‌సీపీకి మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే నిలిపివేత
20 శాతం పనులు కాకపోవడంతో నిలిపివేసినట్టు సాకులు
రెండు జిల్లాల రైతులకు తీవ్ర అన్యాయం
హామీలు మరిచారా?
తాండవ అనుసంధానం పనులు రద్దుపై రైతుల నుంచి వ్యతిరేకత రాకుండా పోలవరం కాలువ నుంచి తాండవ ఎత్తిపోతల పథకం తెస్తానంటూ గత ఏడాది స్పీకర్ హామీ ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి 20 నెలలు అయింది. కానీ ఇంతవరకూ తాండవ ఎత్తిపోతల పథకం ఊసెత్తలేదు. ఇటీవల జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో కూడా ఎటువంటి కేటాయింపులు లేవు. స్పీకర్ ఇచ్చిన హామీని ఎప్పుడు నెరవేరుస్తారంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు.


