పురమిత్ర...ఏదీ స్పందన | - | Sakshi
Sakshi News home page

పురమిత్ర...ఏదీ స్పందన

Mar 12 2026 7:30 AM | Updated on Mar 12 2026 7:30 AM

● యాప్‌లో ఫిర్యాదుల నమోదు అంతంతమాత్రమే ● పట్టణ ప్రజలకు లోపించిన అవగాహన ● అధికారుల్లో నిర్లిప్తతే కారణం

యలమంచిలి రూరల్‌ : పట్టణాలు, నగరాల్లో పురపాలక శాఖ అందించే వివిధ రకాల సేవలు, చెల్లింపులు, ఫిర్యాదుల నమోదుకు చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన పురమిత్ర యాప్‌పై నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. యాప్‌ వినియోగంపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడంలో నిర్లిప్తంగా వ్యవహరిస్తుండడంతో 7 నెలలైనా ప్రజల్లోకి కూడా తీసుకెళ్లలేకపోయారు. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న వారి సంఖ్య నామమాత్రంగానే ఉంది. ఫలితంగా సాంకేతికత ప్రజలకు చేరువ కాలేదు.

320 ఫిర్యాదులు మాత్రమే...

యలమంచిలి పురపాలక సంఘంలో సుమారు 57వేల వరకు జనాభా ఉండగా ఇప్పటివరకు కేవలం 8457 మంది మాత్రమే యాప్‌ను తమ స్మార్ట్‌ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. కేవలం 320 ఫిర్యాదులు మాత్రమే నమోదయ్యాయి. వీటిలో 316 ఫిర్యాదులను అధికారులు పరిష్కరించినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. నాలుగు ఫిర్యాదులు వివిధ కారణాలతో అపరిష్కృతంగా ఉండిపోయాయి. దీనిని బట్టి యాప్‌ వినియోగం చాలా తక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తేనే యాప్‌ ప్రవేశపెట్టిన ప్రయోజనం ఉంటుంది.

ప్రచారార్భాటం...ఫలితం శూన్యం

పౌరసేవలు పొందడానికి పురపాలక కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా పురమిత్ర యాప్‌ను వినియోగించాలన్నది లక్ష్యం. కాగా ప్రభుత్వం కేవలం ప్రచార ఆర్భాటానికే ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రజలకు సాంకేతిక ఫలాలు సక్రమంగా అందడంలేదు.సాంకేతిక అందించే పేరుతో ప్రభుత్వం చేస్తున్న వ్యయం వృధా అవుతోందన్న ఆరోపణలున్నాయి.ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదులు,పారిశుధ్యం,వీధి దీపాలు,నీటి సరఫరా వంటి అంశాలకు సంబంధించి చరవాణి ద్వారానే ప్రజలు సేవలు పొందే అవకాశం ఉన్నప్పటికీ అవగాహన లేమి,తగిన ప్రచారం లేకపోవడంతో అది సాధ్యం కావడం లేదు.

పనితీరు ఇలా..

పట్టణాలు,నగరాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోతున్నాయి. వాటిని పరిష్కరించడానికి పురపాలకశాఖ గతేడాది ఆగస్టు 1వ తేదీ నుంచి పురమిత్ర యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్‌ ద్వారా ఫిర్యాదును అక్షర రూపంలో గానీ, వాయిస్‌ రూపంలో గానీ పంపించే అవకాశం ఉంది. సమస్యను వాయిస్‌ రూపంలో పంపినా అక్షరాల రూపంలో కన్పిస్తోంది. సమస్యను ఫొటోలుగా తీసి పంపవచ్చు. సమస్యను యాప్‌లో పొందుపరిచిన వెంటనే సంబంధిత విభాగానికి చేరుతుంది. నిర్ణీత గడువులోగా సంబంధిత అధికారులు పరిష్కరించాల్సి ఉంటుంది. లేకుంటే ఉన్నతాధికారికి సమాచారం వెళ్తుంది. పురపాలక పరిధిలో రెవెన్యూ,పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్‌ ,అకౌంట్స్‌, పరిపాలన విభాగాల సేవలు పొందే అవకాశం ఉంది. జనన, మరణ,వివాహ ధృవీకరణ పత్రాలు, పన్ను చెల్లింపులు, ట్రేడ్‌ లైసెన్సులు నవీకరణ వంటి సేవలను పొందవచ్చు.సమస్యను బట్టి మూడు రోజుల నుంచి 30 రోజుల వరకు గడువులోగా పరిష్కరించాల్సి ఉంటుంది.ప్రజలు పంపిన సమస్యపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. సమస్య పెండింగ్‌ జాబితాలో చేరితే సంబంధిత అధికారిని బాధ్యుడిని చేస్తారు. ఇదంతా బాగానే ఉన్నా అసలు యాప్‌ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో పాలకవర్గాలు, అధికారుల్లో చిత్తశుద్ధి కొరవడింది. ముఖ్యంగా పట్టణంలో రద్దీగా ఉండే ప్రాంతాలు, షాపింగ్‌ మాళ్లు, హోటళ్ల వద్ద యాప్‌ ప్రయోజనం, వినియోగంపై అవగాహన కల్పించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా అధికారులు ఇప్పటివరకు ఆ దిశగా దృష్టి పెట్టలేదు. యువతకు యాప్‌ వినియోగంపై అవగాహన కల్పిస్తే త్వరగా ప్రయోజనం ఉంటుందని, ఇప్పటికై నా యాప్‌పై పట్టణ ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

యాప్‌ను ప్రజలు వినియోగించుకోవాలి

పురమిత్ర యాప్‌ను పట్టణ ప్రజలు వినియోగించుకోవాలి.దీని ద్వారా సమస్యల పరిష్కారంలో పారదర్శకత,జవాబుదారీతనం ఉంటుంది.పట్టణంలో 12వేలకు పైగా ఇళ్ళు ఉండగా ఇప్పటివరకు 8457 మంది వరకు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.ఈ విషయంలో రాష్ట్రంలో మొదటి 15 స్థానాల్లో యలమంచిలి ఉంది.సమస్యలను ప్రజలు యాప్‌ ద్వారా పంపితే నిర్ణీత గడువులోగా పరిష్కారం లభిస్తుంది.ఈ విధానాన్ని ప్రజలు సద్వినియోగపర్చుకోవాలి.అవసరమైతే యాప్‌ వినియోగంపై మరింత అవగాహన కల్పిస్తాం. –బి.జె.ఎస్‌ ప్రసాదరాజు, మున్సిపల్‌ కమిషనర్‌, యలమంచిలి

Advertisement
 
Advertisement
Advertisement