జీడి పంటకు మద్దతు ధర కల్పించాలి
దేవరాపల్లి : జీడి పంటకు మద్దతు ధర కోసం జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న, మండల కార్యదర్శి బి.టి.దొర తెలిపారు. మండలంలోని గరిశింగి పంచాయతీలో జీడిపిక్కలకు కేజీకి రూ. 200 చొప్పున మద్దతు ధర ప్రకటించి, రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జీడి రైతులతో కలిసి సోమవారం ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వెంకన్న, దొర మాట్లాడుతూ ఇతర దేశాల నుంచి జీడిపిక్కల దిగుమతులను తక్షణమే నిలుపుదల చేసి, జీడి పిక్కలకు మద్దతు ధర కల్పించే అంశాన్ని అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. జీడి పంటకు మద్దతు ధరతో పాటు మార్కెట్ సౌకర్యం కల్పించి, జీడి రైతుల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలన్నారు. అనకాపల్లి జిల్లాలో సుమారు 90వేల ఎకరాలలో నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలలో జీడిని ప్రధాన పంటగా పండిస్తూ గిరిజనులు జీవనోపాధి పొందుతున్నారన్నారు. ఏటా 25వేల మెట్రిక్ టన్నులు జీడి పిక్కలు ఉత్పత్తి అవుతున్నాయని, ప్రభుత్వం మద్దతు ధర కల్పించక పోవడంతో దళారుల బారిన పడి తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీడి పంటను ఈ క్రాప్‌లో నమోదు చేయడంతో పాటు జీడి రైతులకు పంట రుణాలు మంజూరు చేయాలని కోరారు. నిరసనలో మజ్జి గంగన్నదొర, సోముల దేముడు, జన్ని కొండబాబు, సింగారపు రాజు తదితర గిరిజన జీడి రైతులు పాల్గొన్నారు.


