ఆడబిడ్డ నిధికి సమాధి
● 2,06,526 మంది మహిళల ఆశలపై నీళ్లు ● ఏడాదికి రూ.18 వేల చొప్పున 20 నెలలకు రూ.619 కోట్లు ఎగవేత ● పీ4తో ఆడబిడ్డ నిధి అనుసంధానం ఉత్తమాటే ● హామీని అటకెక్కిండానికే అడాప్ట్ అంటూ కాలయాపన ● మరోమారు నమ్మించి మోసం చేశారని లబ్ధిదారుల మండిపాటు
సాక్షి, అనకాపల్లి: కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైన ’ఆడబిడ్డ నిధి’కు పూర్తిగా మంగళం పాడేసినట్టే. ఇటీవల ప్రభుత్వం విడుడల చేసిన బడ్జెట్‌లో కేటాయింపులు చూస్తే...ఈ పథకానికి నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు చేతులెత్తేసినట్లే స్పష్టంగా కనపడుతుంది. అదిగో...ఇదిగో అంటూ ఏడాది పాటూ ఈ పథకంపై ఊరిస్తూ వచ్చి తీరా ఇపుడు మోసం చేశారని మహిళలు మండిపడుతున్నారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడంతో జిల్లా వ్యాప్తంగా 2,06,526 మంది మహిళల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. తన ఆర్థిక సంస్కరణలతో సంపద సృష్టి జరిగిపోతోందని, పేదలందరూ బాగా డబ్బులు సంపాదిస్తున్నారని.. అందువల్ల ఈ నిధి అవసరం లేదని స్పష్టం చేశారు. 2029 నాటికి పేదరికాన్ని నిర్మూలిస్తానని మరోమారు ప్రతినబూనారు. ఒకవేళ అప్పటికి కూడా పేదరికం నుంచి మహిళలు గట్టెక్కకపోతే పీ–4తో ఆడబిడ్డ నిధిని అనుసంధానం చేస్తానని కర్నూలు సభలో చెప్పుకొచ్చారు. చంద్రబాబు మాటలు విన్న మహిళలు నిశ్చేష్టులయ్యారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు పూర్తిగా అమలు చేసేశానంటూ బాబు మాటలు విన్న మహిళలు గతంలో 2014–19 మాదిరే ఈసారి మోసపోయామంటూ ఆవేదన చెందుతున్నారు. ఎక్కడ నలుగురు మహిళలు కలిసినా కూటమి ప్రభుత్వం చేసిన మోసం గురించే చర్చించుకుంటున్నారు.
పీ4తో ఆడబిడ్డ నిధి అనుసంధానం ఉత్తమాటే..
పీ4 అంటూ మార్గదర్శులు, బంగారు కుటుంబాలు అడాప్ట్ చేసుకుని ఆడబిడ్డ నిధిని అనుసంధానం చేస్తానని 20 నెలల పాటు చంద్రబాబు సర్కార్ కాలయాపన చేసే పనిలో ఉంది. అనకాపల్లి జిల్లాలో ఏడు నియోజకవర్గాల పరిధిలో 522 సచివాలయ పరిధిలో మొత్తం 80,163 బంగారు కుటుంబాలకు 2,06,526 మంది కుటుంబ సభ్యులను గుర్తించామని, వీటిలో 47,597 కుటుంబాలను అడాప్ట్ చేసేశామని వెబ్‌సైట్‌లలో పెట్టి ప్రచారం చేసుకుంటున్నారు.
ఆడ బిడ్డ నిధి దాదాపుగా రెండేళ్ల పాటు మంగళం పాడేశారు. ఎన్నికల వరకూ కాలయాపన చేసి దగ్గర చేసి ఒక ఏడాది పాటు ఇచ్చే కుట్రకు చంద్రబాబు సర్కార్ పాల్పడుతుందంటూ రాజకీయ విశ్లేషకులుసైతం చర్చించుకుంటున్నారు.
రెండేళ్లకు రూ.619 కోట్లు ఎగవేత..
జిల్లాలో ఉన్న 2,06,526 మంది మహిళలను నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా 20 నెలలకు రూ.619 కోట్లు ఇవ్వాల్సి ఉంది. వీటికి చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా మంగళం పాడేసింది.


