కల్యాణోత్సవం
న ఉపమాక వెంకన్న
నక్కపల్లి : ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వర స్వామి వార్షిక కల్యాణోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 26 నుంచి స్వామివారి వార్షిక తిరుకల్యాణోత్సవాలు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారం నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్దానం వారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర తిరుపతి గా పేరు గాంచిన ఆలయంలో ప్రతి ఏటా మాఘశుద్ధ ఏకాదశినాడు స్వామివారి వార్షిక కల్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈనెల 26న ఉదయం అంకురార్ఫణతో ఉత్పవాలు ప్రారంభమవుతాయి. 27వ తేదీ రాత్రి స్వామివారి రథోత్సవం, ఎదురు సన్నాహమహోత్సవం, కల్యాణం అంగరంగ వైభవంగా జరుగుతాయి.
విద్యుద్దీపాలంకరణ
ఆలయప్రాంగణంలో ఉన్న రాజగోపురం, ఉత్సవమూర్తులున్న గోపురం, బేడామండపం, కల్యాణమండపం, తదితర గోపురాలకు రంగులు వేస్తున్నారు. ధ్వజస్తంభం వద్ద మెట్లమార్గం స్వామివారి పుష్కరిణి, కొండపై మూలవిరాట్‌సన్నిధిలో ఆకర్షణీయమైన రంగులు వేస్తున్నారు. ఇటీవలే పుష్కరిణిలో పూడికతీత పనులు చేపట్టారు. స్నాన ఘట్టాలను ఏర్పాటు చేశారు. నక్కపల్లి జాతీయ రహదారినుంచి ఉపమాక ఆలయం వరకు రోడ్డుకు ఇరువైపులా భారీ విద్యుద్దీపాలంకరణ ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంతోపాటు, గరుడాద్రిపైన ఆలయ ప్రాకారంలో ఉన్న గోపురాలు బేడామండపం వద్ద కూడా విద్యుద్దీపాలంకరణ చేశారు. రాజగోపురం ఎదురుగా అఖిలాండం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంనుంచి భక్తులు స్వామివారి కల్యాణం తిలకించేందుకు వీలుగా భారీ పెంటార్లు, జర్మన్ టెంట్లు, ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక క్యూకాంప్లెక్స్‌లు, ఉచిత దర్శనాలు, టికెట్ దర్శనాలు ఏర్పాటు చేస్తున్నారు. కల్యాణం రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు.
నెలరోజుల పాటు తిరునాళ్లు
కల్యాణోత్సవాల సందర్భంగా నెలరోజుల పాటు తిరునాళ్లు జరుగుతాయి. వివిధ ప్రాంతానుంచి వచ్చిన వ్యాపారులు మసాలాదినుసులు, ఇత్తడి, రాగి, స్టీలు, కిరాణా సరుకులు విక్రయిస్తారు. నక్కపల్లి నూకాలమ్మ ఆలయప్రాంగణం, మనబానవానిపాలెం,ఉపమాక నూకాలమ్మ గుడి ప్రాంగణాల్లో వాహనాలను నిలపుకొనే వెసులుబాటు కల్పిస్తున్నారు. నర్సీపట్నం డీఎస్పీ పోతిన శ్రీనివాస రావు, సీఐ మురళి, ఎస్‌ఐ సన్నిబాబు పర్యవేక్షణలో 300 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు.
26న స్వామికి స్వర్ణాభరణాల అలంకరణ
స్వామివారికి వెలకట్టలేనన్ని బంగారు ఆభరణాలు ఉన్నాయి. రత్నకిరీటం, వజ్ర, వైఢూర్యాలు, మరకత మాణిక్యాలు, పచ్చలహారం మంగళసూత్రాలు, కటిహస్తం, కెంపులను ప్రతి ఏటా కల్యాణోత్సవాల సందర్భంగా విశాఖలోని సబ్‌ట్రెజరీ నుంచి తెచ్చి స్వామివారికి అలంకరిస్తారు. ఈ నెల 26న స్వర్ణాభరణాల అలంకారంతో భక్తులకు స్వామి దర్శనం కల్పిస్తారు.


