అత్యుత్తమ సాంకేతికతతో డ్రైవింగ్ శిక్షణ
అనకాపల్లి: మహిళలు అన్నిరంగాల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని, రానున్న రోజుల్లో పురుషులతో సమానంగా ప్రజారవాణాశాఖలో డ్రైవర్లుగా భర్తీఅయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రజారవాణాశాఖ(ఆర్టీసీ) జిల్లా అధికారి వి.ప్రవీణ అన్నారు. స్థానిక రవాణాశాఖ కార్యాలయంలో 12వ బ్యాచ్ హెవీ డ్రైవింగ్, లైసెన్స్ శిక్షణ కార్యక్రమంలో సోమవారం ఆమె మాట్లాడారు. శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు తక్కువ ఫీజుతో హెవీ డ్రైవింగ్‌తో పాటు లైసెన్స్‌ను ఆర్టీవోశాఖ ద్వారా అందజేయడం జరుగుతుందన్నారు. డ్రైవింగ్ శిక్షణ ద్వారా రాబోయే రోజుల్లో డ్రైవింగ్ ద్వారా ఉపాధి అవకాశాలు పొందచ్చన్నారు. అత్యుత్తమ సాంకేతికతతో కూడిన డ్రైవర్లు కొరతను అధిగమించడానికి ఆర్టీసీలో డ్రైవింగ్ స్కూల్ ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో డ్రైవర్లుగా శిక్షణ పొందిన మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు పొందుతారని ఆమె పేర్కొన్నారు. డ్రైవింగ్ స్కూల్ ద్వారా 173 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని, 12వ బ్యాచ్‌లో 16 మందికి కొత్తగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం డ్రైవింగ్ స్కూల్ల్లో శిక్షణ పొందుతున్న మణి అనే మహిళకు సర్టిఫికెట్ అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ హనుమశ్రీ, అసిస్టెంట్ మేనేజర్ వి.గౌరి, డ్రైవింగ్ ఇన్‌స్పెక్టర్ రమణ, డ్రైవింగ్ స్కూల్ అసిస్టెంట్ ఎ.వి.బాపునాయుడు పాల్గొన్నారు.


