గోవాడ.. గరం గరం | - | Sakshi
Sakshi News home page

గోవాడ.. గరం గరం

Feb 22 2026 7:24 AM | Updated on Feb 22 2026 7:24 AM

గోవాడ

గోవాడ.. గరం గరం

చోడవరం: గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ మనుగడపై నీలినీడలు కమ్ముకున్నాయి. తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఫ్యాక్టరీకి కనీసం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం కేటాయించలేదు. చెరకు రైతులు, కార్మికులకు బకాయిలు చెల్లించేందుకు సుమారు రూ. 29కోట్లు అవసరం కాగా, ఈ బడ్జెట్‌లో ఎటువంటి కేటాయింపులు చేయలేదు. దీంతో ఫ్యాక్టరీని మూసివేసేదిశగానే ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. చోడవరం, మాడుగుల ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు కూడా నీటి మూటలుగా మిగిలిపోవడంతో రైతులు, కార్మికులు మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. 2023–24 సీజన్‌కు సంబంధించి చెరకు రైతులకు రూ. 24కోట్లు, కార్మికులకు జీతభత్యాలు కింద మరో రూ.5కోట్లు కలిపి సుమారు రూ. 29కోట్లు తక్షణం చెల్లించాల్సి ఉంది. జీతాలు చెల్లించకపోవడంతో చక్కెర పరిశ్రమలో కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఫ్యాక్టరీ పూర్తిగా నష్టాల్లో ఉండటంతో ప్రభుత్వమే గ్రాంటు రూపంలో ఆదుకోవాల్సి ఉంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్యాక్టరీకి ఒక్క పైసా కూడా సాయం చేయలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా రూ. 10నుంచి రూ.20 కోట్ల వరకూ సాయం చేసి, ఐదేళ్లలో సుమారు రూ.89కోట్లు అందించింది. దీంతో ఫ్యాక్టరీ ఆర్థికంగా నష్టాల్లో ఉన్నా రైతులకు చెరకు పేమెంట్స్‌, కార్మికులకు జీతాలకు ఎక్కడా బకాయి లేకుండా ఐదేళ్లు క్రషింగ్‌కూడా సజావుగానే సాగింది. ఈ ఏడాది ఏకంగా ఫ్యాక్టరీ క్రషింగ్‌ చేయకుండా ఇక్కడ ఉన్న చెరకును సంకిలి ప్రైవేటు ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు. గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీకి ప్రభుత్వ కనీసం రూ. 40కోట్లు అందజేసి, ఆదుకుంటే తప్ప ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టేక్కే పరిస్థితిలేదు. అంటే ఇక ప్రభుత్వమే ఫ్యాక్టరీని నడిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

హామీలు గాలికి...

ఎన్నికల ముందు చంబ్రాబు, పవన్‌కల్యాణ్‌, లోకేష్‌, స్థానిక నాయకులు ఫ్యాక్టరీని ఆదుకుంటాం, ఆధునికీకరిస్తాం, చెరకు రైతులకు టన్నుకి రూ.4వేలు గిట్టుబాటు ధర ఇస్తామని హామీలిచ్చారు. వారంతా ఇప్పుడు ఫ్యాక్టరీపై నోరు మెదపడం లేదు. దీనిపై నాలుగు నెలల పాటు రైతులు, కార్మికులు వివిధ దశల్లో ఆందోళన చేశారు. ఫ్యాక్టరీ వద్ద 24రోజులు దీక్షలు నిర్వహించారు. ఈ దీక్షలను విరమింపజేయలన్న ప్రభుత్వ ఒత్తిడితో చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌.రాజు, బండారు సత్యనారాయణమూర్తి శిబిరం వద్దకు వచ్చి ప్రభుత్వంతో మాట్లాడి 10రోజుల్లో కార్మికుల జీతాల బకాయి లు, రైతుల చెరకు బకాయిలు చెల్లిస్తామని హామీఇచ్చి దీక్షలు విరమింపజేశారు. ఇది జరిగి నెలరోజులు దాటిపోయింది. అయినా దీనిపై ఎమ్మెల్యేలు స్పందించలేదు.

బడ్జెట్‌లో రిక్తహస్తం

ఇటీవల శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు జరిగాయి. ఆ బడ్జెట్‌లో గోవాడ ఫ్యాక్టరీ గురించి గాని, రైతులు, కార్మికుల బకాయిల గురించి గానీ ఎక్కడా కేటాయింపులు చేయలేదు. బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తారన్న ఆశతో ఉన్న రైతులు, కార్మికుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. బడ్జెట్‌ ప్రవేశపెట్టక ముందు జరిగిన సమావేశాల్లో దీనిపై చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు ప్రస్తావించలేదు. బడ్జెట్‌ పూర్తయిపోయిన రెండురోజుల తర్వాత చోడవరం ఎమ్మెల్యే రాజు గోవాడ ఫ్యాక్టరీ, చెరకు బకాయిల కోసం అసెంబ్లీలో ప్రస్తావించడం వెనుక ఆంతర్యమేంటని అఖిల పక్ష రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అంటే ముందు ప్రస్తావిస్తే బడ్జెట్‌లో కేటాయింపులు చేయాల్సి వస్తుందని సీఎం వ్యూహాత్మకంగా బడ్జెట్‌ పూర్తయిన తర్వాత మాట్లాడమని ఎమ్మెల్యేకి చెప్పారా అనే ప్రశ్న సర్వత్రా నెలకొంది. ఇక సీనియర్‌ ఎమ్మెల్యే అయిన బండారు సత్యనారాయణమూర్తి అయితే దీనిపై శాసనసభ సమావేశాల్లో ఎక్కడా ప్రస్తావనే చేయకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఉద్యమాన్ని నీరగార్చేందుకు ఎమ్మెల్యే వచ్చి మాయమాటలు చెప్పి రైతులను, కార్మికులను మోసంచేశారని వారు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో మరోసారి ఆందోళనకు రైతులు, కా ర్మికులు సిద్ధమతున్నారు. ఇప్పటికే అఖిలపక్షనాయకులంతా దీనిపై చర్చించారు. ఈ దఫా ఆందోళన ఏవిధంగా చేయాలనే అంశంపై యోచన చేస్తున్నారు. ఈ వారంలో అఖిల పక్షాల ఆధ్వర్యంలో రెండో దఫా ఆందోళనకు రైతులు, కార్మికులు సిద్ధమతున్నారు. ఫ్యాక్టరీని నమ్ముకుని చెరకు పండించిన 24వేల మంది రైతులు, కార్మికులు గురించి ప్రభుత్వం ఆలోచన చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఏడాది బడ్జెట్‌లో గోవాడ ఫ్యాక్టరీకి మొండిచేయి చూపిన ప్రభుత్వం

నీటి మూటలైన ఎమ్మెల్యేల హామీ

మరో మారు ఉద్యమబాటలో గోవాడ కర్షకులు, కార్మికులు

గోవాడ.. గరం గరం1
1/1

గోవాడ.. గరం గరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement