పెళ్లింట రోడ్డు ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

పెళ్లింట రోడ్డు ప్రమాదం

Feb 22 2026 7:24 AM | Updated on Feb 22 2026 4:48 PM

-

కె.కోటపాడు/బుచ్చెయ్యపేట: బంధువుల సందడి, పచ్చనితోరణాలు, మేళతాళాలు, భాజాభజంత్రీలతో అంతవరకూ సందడిగా ఉన్న పెళ్లి ఇంటిలో రోడ్డు ప్రమాదం ఒక్కసారిగా విషాదం నింపింది. శుక్రవారం రాత్రంతా సోదరుడి పెళ్లి వేడుకల్లో సందడిగా తిరిగిన గీతా లావణ్య(23) శనివారం ఉదయం జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి బుచ్చెయ్యపేట మండలం విజయరామరాజుపేటకు చెందిన ఆటో డ్రైవర్‌ ముత్యాల జగన్నాథరావు,రాజేశ్వరిల రెండో కుమారుడు మోహన్‌ కుమార్‌కు శుక్రవారం రాత్రి శ్రీకాకుళానికి చెందిన సునందతో వివాహం జరిగింది. శనివారం తెల్లవారుజామున అత్తవారింటికి వెళ్లేందుకు పెళ్లికుమారుడు మోహన్‌కుమార్‌, పెళ్లి కుమార్తె సునంద కారులో బయలుదేరారు. వీరితో పాటు అదే కారులో మోహన్‌కుమార్‌ సోదరి గీతాలావణ్య, ఆమె భర్త హరీష్‌, పెళ్లి కుమార్తె చెల్లెలు శిరీషా ప్రయాణమయ్యారు.విజయరామరాజుపేటలో శనివారం తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరిన కారు కె.కోటపాడు మండలం బత్తివానిపాలెం సమీపానికి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌, పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తె, హరీష్‌, గీతాలావణ్య, శిరీషాలకు గాయాలయ్యాయి. వీరిని 108లో కె.కోటపాడు ఆస్పత్రికి తీసుకువచ్చి ప్రథమ చికిత్స చేశారు. మెరుగైన వైద్యం కోసం మోహన్‌కుమార్‌, ఆయన చెల్లి గీతాలావణ్య, బావ హరీష్‌, శిరీషాలను విశాఖపట్నం ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యంలో గీతా లావణ్య మృతిచెందింది. మృతురాలు తండ్రి జగన్నాథరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు ఎస్‌ఐ ఆర్‌.ధనుంజయ్‌ తెలిపారు. గీతాలావణ్యకు హరీష్‌తో గత ఏడాది జూన్‌ 6న వివాహం జరిగింది. కాగా తన అన్నయ్యకు కూడా తన అత్తావారి ఊరిలోనే వివాహ సంబంధం కుదరడంతో ఆమె సంతోషించింది. వివాహం జరిగి ఏడాది కాకముందే గీతాలావణ్య మృతిచెందడంతో స్థానికులను కంటతడి పెట్టించింది. తండ్రి జగన్నాథం, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. గీతా లావణ్య మృతదేహానికి విజయరామరాజుపేటలో అంత్యక్రియలు నిర్వహించారు.

మృతిచెందిన

గీతా లావణ్య

గాయపడిన మోహన్‌కుమార్‌

వివరాలను ఫోన్‌లో కుటుంబ సభ్యులకు వివరిస్తున్న పెళ్లికుమార్తె సునంద, ప్రమాదానికి గురైన కారు

రోడ్డు ప్రమాదంలో

పెళ్లి కుమారుడు చెల్లి మృతి

మరో ఐదుగురికి గాయాలు

అత్తారింటికి శ్రీకాకుళం వెళ్తున్న

సమయంలో చెట్టును ఢీకొన్న కారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement