ఉపమాక ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
హోంమంత్రి అనిత
మాట్లాడుతున్న మంత్రి అనిత
నక్కపల్లి: ఈనెల 26నుంచి ప్రారంభం కానున్న ఉపమాక వేంకటేశ్వర స్వామి వార్షిక కల్యాణోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. శనివారం ఆమె దేవస్థానంలో ఉత్సవ ఏర్పాట్లపై టీటీడీ, రెవెన్యూ,పోలీసు,పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కల్యాణోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చేఅవకాశం ఉండడంతో ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు. సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రత్యేక క్యూకాంప్లెక్స్‌లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. స్వామివారి రథోత్సవం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రతలను గురించి పలు సూచనలు చేశారు. పోలీసు అవుట్‌పోస్టు, సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ మురళి, ఎస్‌ఐ సన్నిబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు.


