చెరకు రైతులను ముంచేసిన చంద్రబాబు
కోటవురట్ల: చంద్రబాబు ప్రభుత్వం చెరకు రైతులను నిండా ముంచేసిందని వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్.ఎస్. సత్యనారాయణ రాజు విమర్శించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా చెరకు ఉత్పత్తికి కేంద్ర ఉండేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మోసంతో ఇప్పుడు రైతులు చెరుకు పంటను వేయడం మానుకొన్నారని తెలిపారు. జిల్లాలోని తుంపాల, తాండవ, ఏటికొప్పాక చక్కెర కర్మాగారాలను ఆధునికీకరించి చెరకు రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. గోవాడ ఫ్యాక్టరీ చెరకు రైతులకు, కార్మికులకు బకాయిలు నేటికీ చెల్లించకపోవడం దారుణమన్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎంపీగా పోటీ చేసి బూటకపు హామీలతో పదవిలోకి వచ్చిన సీఎం రమేష్ చెరకు రైతుల ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. ఇక చోడవరం ఎమ్మెల్యే గోవాడ సుగర్ ఫ్యాక్టరీ విషయంలో మొసలికన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు.


