సహకారం బంద్!
సాక్షి, అనకాపల్లి: తమ డిమాండ్లను నెరవేర్చాలని, సమస్యలు పరిష్కరించాలని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) ఉద్యోగుల సమ్మె బాట పట్టడంతో సేవలు నిలిచిపోయాయి. ఏపీ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏపీపీఏసీఎస్ ఉద్యోగుల యూనియన్ చేపట్టిన నిరవధిక సమ్మె ఐదో రోజు కొనసాగింది. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)పరిధిలో పనిచేస్తున్న అనకాపల్లి జిల్లాలో గల 74 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘా (పీఏసీఎస్)ల్లో పనిచేస్తున్న 300 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. వీరిలో అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు 100 మంది ఉన్నారు. వీరంతా సమ్మె చేస్తుండడంతో సొసైటీల్లో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. పీఏసీఎస్‌లు మూతపడడంతో లావాదేవీలు స్తంభించాయి. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బ్రాంచి కార్యాలయాల్లో పీఏసీఎస్‌లకు సంబంధించిన లావాదేవీలు జరగడంలేదు. రైతుల పంట రుణాలు, భూములపై వ్యక్తిగత రుణాలు, సబ్సిడీ ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల పంపిణీ ఆగిపోయాయి. వ్యవసాయ రుణాలు అందక అన్నదాతలు అవస్థలకు గురవుతున్నారు. సకాలంలో క్రాప్‌లోన్ చెల్లించలేకపోవడంతో 7 శాతం వడ్డీకి గానూ 13.5 శాతం వరకూ వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి 18 నెలలుగా జీవో 36ను అమలు చేయాలని పీఏసీఎస్ ఉద్యోగులు కోరుతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని, ఆప్కాబ్, సహకార కమిషనర్ దృష్టికి పలు మార్లు ఉద్యోగులు తీసుకెళ్లినా ఫలితం శూన్యమైంది. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్లు ఏకమై రాష్ట్ర జేఏసీగా ఏర్పడి రెండు నెలలుగా డీసీవో, డీసీసీబీ కార్యాలయాల వద్ద ధర్నా, నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తున్నారు.
వివిధ రూపాల్లో పోరాటం..
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నుంచి పీఏసీఎస్ ఉద్యోగులు డిమాండ్ల సాధనకు పోరుబాట పట్టారు. 18 నెలలుగా దశల వారీ ఉద్యమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర సహకార బ్యాంకు (ఆప్కాబ్) కమిషనర్ దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లారు. తమ డిమాండ్లపై శాసనసభ, శాసనమండలిలో చర్చించాలని వినతి పత్రాలు కూడా అందజేశారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో గుంటూరు సహకార కమిషనర్ కార్యాలయం వద్ద రాష్ట్రంలో గల 23 జిల్లాల ఉద్యోగులు 13 రోజుల పాటు ‘వంటా–వార్పు’ కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద 9,000 మందితో ధర్నా చేశారు. ప్రభుత్వం స్పందించక పోవడంతో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈనెల 16వ తేదీ నుంచి ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. డీసీవో, డీసీసీబీ, ఆప్కాబ్ కమిషనర్ కార్యాలయాల వద్ద వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగించారు. తమ సమస్యలకు పరిష్కారం లభించేదాకా ఎన్ని రోజులైనా సమ్మెలోనే ఉంటామంటూ ఉద్యోగులు, జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
వేతన సవరణ చేయాలి
పీఏసీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని పలు మార్లు కోరినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వానికి వినతిపత్రాలు అందజేశాం, అయినా స్పందించలేదు. దీంతో సమ్మె చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. వేతన సవరణ చేసి, జీవో నంబర్ 36ను పూర్తిస్థాయిలో అమలు చేసే వరకూ సమ్మెను కొనసాగిస్తాం.
– బి.సతీష్ కుమార్, క్లర్క్, దిమిలి పీఏసీఎస్
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
మా డిమాండ్ల సాధన, సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి చాలా సార్లు విన్నవించుకున్నాం. రెండు నెలల పాటు విధులకు ఆటంకం లేకుండా ధర్నాలు, ఆందోళనలు చేశాం. ఆప్కాబ్ అధికారులకు వినతి పత్రాలు అందజేశాం. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. సమ్మె కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడతారని తెలిసినా తప్పని సరిస్థితుల్లో విధులు బహిష్కరించవలసి వస్తోంది. ఆప్కాబ్ నుంచి డీసీసీబీకి నగదు వచ్చింది. ఈ నగదును పీఏసీఎస్ పరిధిలో ఉన్న రైతులకు డివిడెంట్‌గా అందజేయాలి, గత ఏడాది నుంచి చెల్లించడం లేదు. ఆ సొమ్మును వెంటనే చెల్లించాలి, హెచ్‌ఆర్ పాలసీని తక్షణమే అమలు చేయాలి, జీతాలు పెంచాలి.
– బి.లక్ష్మణరావు, పీఏసీఎస్ ఉద్యోగుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు
చాలీచాలని జీతాలు
పీఏసీఎస్‌లను అభివృద్ధి, బలోపేతం చేయడంలో ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారు. చాలీచాలనీ జీతాలతో కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. వేతన సవరణ చేయాలంటూ 2019–20లో ప్రభుత్వం జీవో విడుదల చేసింది. నేటి వరకూ ఆ జీవో అమలు కాలేదు. ఉద్యోగ విరమణ చేసిన వారికి ప్రస్తుతం అందిస్తున్న గ్రాట్యుటీని రూ.2 లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచాలి.
– బి.సత్యనారాయణమూర్తి, సీఈవో, పీఏసీఎస్, చౌడువాడ
మూతపడిన పీఏసీఎస్‌లు..
నిలిచిన సేవలు
ఐదో రోజు కొనసాగిన పీఏసీఎస్ ఉద్యోగుల నిరవధిక సమ్మె
సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందక రైతులకు ఇక్కట్లు
పంట రుణాలు ఆగిపోవడంతో
అన్నదాతలకు తప్పని అవస్థలు
రుణాలపై 13.5 శాతం వడ్డీ
చెల్లించాల్సిన పరిస్థితి
సహకారం బంద్!
సహకారం బంద్!
సహకారం బంద్!
సహకారం బంద్!


