కించుమండ గిరిజనుల వినూత్న నిరసన
దేవరాపల్లి : గరిశింగి పంచాయతీ శివారు కించుమండ గ్రామంలో గురువారం స్థానిక గిరిజనులు ఆదివాసి గిరిజన సంఘం నాన్ షెడ్యూల్ జిల్లా ఉపాధ్యక్షుడు బీటీ దొర ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతూ అడ్డాకులు టోపీలు ధరించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఫొటో చేత పట్టుకొని ఆందోళనకు దిగారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం లేక నిత్యం నరకయాతన అనుభవిస్తున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా కించుమండలో 13 కుటుంబాలు, 57 మంది గిరిజనులు నివసిస్తున్నామని, గ్రామానికి చేరుకోవాలంటే మూడు కిలోమీటర్ల మేర కొండ ఎక్కాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఎవరికి అనారోగ్యం వచ్చినా గర్భిణులు ప్రసవ సమయంలోనైనా డోలీ మోతలే శరణ్యమని వాపోయారు. నిత్యవసర సరుకులు తెచ్చుకోవాలన్నా, విద్యార్థులు చదువుకోవాలన్నా రోజూ మూడు కిలోమీటర్ల మేర కాలినడకన కొండ ఎక్కి దిగాల్సిందేనన్నారు. రాష్ట్రంలో డోలీ మోతలు లేని గ్రామాలు తీర్చిదిద్దుతామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ముక్తకంఠంతో కోరారు. కించుమండకు రోడ్డు సౌకర్యం కల్పించాలని పీజీఆర్‌ఎస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సర్వే చేసి రూ. 3.33 కోట్లు నిధులు అవసరమని ప్రతిపాదించి, నిధులు మంజూరు చేయడం మరిచారని బీటీ దొర విమర్శించారు. ఇప్పటికై నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కించుమండకు రోడ్డు సౌకర్యం కల్చించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కంచర గంగరాజు, చెరుకు రాజు, కంచర యేసుదాసు, కంచర రవికుమార్ తదితర గిరిజనులు పాల్గొన్నారు.


