హామీలపై ప్రజలను దగా చేసిన ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

హామీలపై ప్రజలను దగా చేసిన ప్రభుత్వం

Feb 18 2026 7:08 AM | Updated on Feb 18 2026 7:08 AM

 హామీలపై ప్రజలను దగా చేసిన ప్రభుత్వం

హామీలపై ప్రజలను దగా చేసిన ప్రభుత్వం

● బడ్జెట్‌లో సూపర్‌సిక్స్‌ హామీలకు ఎగనామం పెట్టారు ● ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పింఛన్‌ వంటి హామీలకు మొండిచేయి ● మాజీ డిప్యూటీ సిఎం బూడి ముత్యాలనాయుడు విమర్శ

దేవరాపల్లి: చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో సూపర్‌ సిక్స్‌ హామీలకు కేటాయింపులు చేయకుండా రాష్ట్ర ప్రజలను మరోమారు మోసగించారని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. తారువలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభు త్వం ఏర్పడిన తర్వాత ప్రవేశ పెట్టిన మూడో బడ్జెట్‌లో కూడా ఎన్నికల హామీలకు మొండి చేయి చూపారన్నారు. ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ నెలకు రూ. 1500 చొప్పున అందిస్తామని చెప్పి, బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం మహిళలను మోసగించడమేనన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, ఉద్యోగాలు కల్పించకుంటే నెలకు రూ. 3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని దగా చేశారన్నారు. 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికి నెలకు రూ.4వేలు పింఛన్‌ అందిస్తామని మొండి చేయి చూపారన్నారు. చంద్రబాబు ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తున్నా పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నించక పోవడం దారుణమన్నారు. వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే తేదీలు ఖరారు చేసి మరీ నవరత్న సంక్షేమ పథకాలను అందించిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికే దక్కిందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని మరిన్ని పథకాలను సైతం నిరాటంకంగా వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేశారని గుర్తుచేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో 65 ఏళ్ల వృద్ధాప్య పింఛన్‌ వయసు పరిమితిని వైఎస్సార్‌సీపీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే 60 ఏళ్లకు తగ్గించి రాజకీయ పార్టీలకు అతీతంగా కొత్త పింఛన్లు మంజూరు చేసి జగన్‌మోహన్‌రెడ్డి మాట నిలబెట్టుకున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన పింఛన్లు తప్ప కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త పింఛను కూడా మంజూరు చేయలేదన్నారు. ఉచిత గ్యాస్‌ పథకం ద్వారా ఇప్పటి వరకు ఆరు సిలిండర్లకు గాను కేవలం మూడు సిలిండర్లకు మాత్రమే డబ్బులిచ్చి, మరో మూడు బండ్లకు డబ్బులు ఎగ్గొట్టారని ఆరోపించారు. సీ్త్ర శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణానికి అరకొరగా బస్సులు కేటాయించడంతో అక్కచెల్లెమ్మలు, విద్యార్థినులు నరకయాతన అనుభవిస్తున్నారన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సూపర్‌సిక్స్‌ హామీలను అమలు చేయకపోగా, జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన కాపు నేస్తం, వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా ఏటా రూ. 18750 అందించే పథకాలను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతలు లేని రోడ్లుగా మారుస్తామని చెప్పి రెండేళ్లు కావస్తున్నా బాగు చేయకపోవడంతో మరింత గుంతలుగా మారా యని ఎద్దేవా చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement