పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
సాక్షి, అనకాపల్లి: పదో తరగతి, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 23 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 2వ తేదీ నుంచి మార్చి 13వ తేదీ వరకు ఓపెన్ ఇంటర్ స్కూల్ పరీక్షలు, అదేవిధంగా మార్చి 16 నుంచి మార్చి 29 వ తేదీ వరకూ పది పరీక్షలు జరగనున్నాయి. సమన్వయంతో అధికారులందరూ పనిచేసి విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో పక్కాగా ఏర్పాట్లు ఉండాలని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి జి.అప్పారావు నాయుడును కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ముందుగా చేరుకునేలా బస్సులను ఏర్పాటు చేయాలని ప్రజా రవాణాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల సమయంలో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా చూడాని, తాగునీరు ఏర్పాటు చేయాలని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షను అమలు చేయాలని, సమీపంలో జెరాక్స్ సెంటర్లను పరీక్షల సమయంలో మూసివేయాలని, పరీక్షల నిర్వహణ తనిఖీకి సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్యాడ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణ అనంతరం జవాబు పత్రాల బండిల్స్ సకాలంలో పంపించుటకు తపాలా శాఖ సిబ్బంది సహకరించాలని అన్నారు. ప్రైవేటు పాఠశాలలతో ఎక్కడా మాస్ కాపీయింగు జరుగకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయాలని, సమస్యాత్మక కేంద్రాలలో అదనపు భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఇన్‌చార్జి డీఆర్‌ఓ శ్రీనివాస్, డీఈఓ జి.అప్పారావునాయుడు, డీఐఈఓ వినోద్‌బాబు, జిల్లా రవాణా శాఖ అధికారి జి. మనోహర్, వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు, విద్యుత్ తపాలా శాఖ అధికారులు పాల్గొన్నారు.


