అసంఘటిత కార్మికులకు ‘పెన్షన్’ భరోసా
సీతంపేట: చిరు వ్యాపారులు, అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం ప్రధాన్ మంత్రి శ్రమ్‌యోగి మాన్‌ధన్(పీఎం–ఎస్‌వైఎం), జాతీయ పెన్షన్ విధానం–చిరు వ్యాపారులు (ఎన్‌పీఎస్–ట్రేడర్స్) పథకాలను అమలు చేస్తోందని జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఎం.రామారావు తెలిపారు. గురువారం అక్కయ్యపాలెం మెయిన్‌రోడ్‌లోని కార్మిక శాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పథకాల వివరాలను వెల్లడించారు. చిన్న వ్యాపారులు, దుకాణదారులు, హాకర్లు, వీధి వ్యాపారులు తదితర అసంఘటిత రంగానికి చెందిన కార్మికులు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చన్నారు. నెలకు నిర్ణీత మొత్తం చందా చెల్లించడం ద్వారా, 60 ఏళ్లు పూర్తయిన తర్వాత నెలకు కనీసం రూ.3,000 పెన్షన్ పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. 18 నుంచి 40 సంవత్సరాల వయసు ఉండి, నెలవారీ ఆదాయం రూ. 15,000 లోపు ఉన్న కార్మికులు, అలాగే వార్షిక టర్నోవర్ రూ.1.5 కోట్లు మించని వ్యాపారులు ఇందుకు అర్హులని పేర్కొన్నారు. అయితే పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు ఉన్నవారు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, ఇతర ప్రభుత్వ పెన్షన్ పథకాలు వర్తించేవారు అనర్హులని స్పష్టం చేశారు. లబ్ధిదారులు చెల్లించే చందాకు సమానంగా కేంద్ర ప్రభుత్వం కూడా తన వాటాను జమ చేస్తుందన్నారు. ఈ పథకాల నిర్వహణ బాధ్యత ఎల్‌ఐసీ పర్యవేక్షిస్తుందని తెలిపారు. పట్టణ ప్రాంత వాసులు ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 15 లోగా, గ్రామీణ ప్రాంతాల వారు ఫిబ్రవరి 16 నుంచి మార్చి 15 లోగా పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.


