వీఎంఆర్డీఏను సందర్శించిన ఐఐపీఏ బృందం
విశాఖ సిటీ: వీఎంఆర్డీఏ కార్యాలయాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ సురేంద్రనాథ్ త్రిపాఠి నేతృత్వంలో 10 మంది ప్రతినిధుల బృందం బుధవారం సందర్శించింది. వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్‌భరత్ మూడు జిల్లాల పరిధిలో చేపడుతున్న కార్యకలాపాలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వీఎంఆర్డీఏ బృహత్తర ప్రణాళిక రూపకల్పన, ప్రాజెక్టులు, పార్కుల అభివృద్ధి, నిర్మాణాలు తదితర అంశాలపై బృందానికి విశదీకరించారు. అలాగే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ సన్నద్ధత, 15 ప్రధాన రహదారుల అభివృద్ధిని తెలియజేశారు. పర్యాటక సంబంధిత ప్రాజెక్టుల పురోగతిపై జాయింట్ కమిషనర్ రమేష్ బృంద సభ్యులకు తెలిపారు. అనంతరం డైరెక్టర్ జనరల్ సురేంద్రనాథ్ త్రిపాఠి మాట్లాడుతూ మహా నగరంలో వీఎంఆర్డీఏ పార్కులు, పర్యాటక ప్రాంతాలు సుందరీకరణ, నగర అందాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని కొనియాడారు. అనంతరం సంస్థ డైరెక్టర్‌ను మెట్రోపాలిటిన్ కమిషనర్ తేజ్‌భరత్ శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. సమావేశం తర్వాత బృందం వీఎంఆర్డీఏ మ్యూజియాలు, పార్కులతో పాటు కై లాసగిరిని సందర్శించింది. ఈ సమావేశంలో కార్యదర్శి మురళీకృష్ణ, ప్రధాన గణాంకాధికారి వై.హరిప్రసాద్, ప్లానింగ్ అధికారిణి రోహిణి తదితరులు పాల్గొన్నారు.


