రసవత్తరంగా ఖోఖో పోటీలు
అగనంపూడి: లంకెలపాలెం ఉన్నత పాఠశాల వేదికగా రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ ఖోఖో టోర్నమెంట్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. అండర్–14 బాలబాలికల విభాగాల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి మొత్తం 26 జట్లు నాలుగు పూల్స్‌లో తలపడ్డాయి. క్రీడాకారుల పోరాట పటిమ, వ్యూహాలతో శనివారం నాటి మ్యాచ్‌లు రసవత్తరంగా జరిగాయి. ఉదయం ప్రారంభమైన పోటీలు రాత్రి 9 గంటల వరకు నిరాటంకంగా జరిగాయి. కార్పొరేటర్లు పల్లా శ్రీనివాసరావు, బొండా జగన్, మొల్లి ముత్యాల నాయుడు, రౌతు శ్రీనివాసరావు, ఇల్లపు వరలక్ష్మి ప్రసాద్, ఎంఈవో దివాకర్రావు, విద్యా కమిటీ చైర్మన్ గుర్రం అప్పలరాజు తదితరులు క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. పాఠశాల హెచ్‌ఎం రౌతు నాగేశ్వరరావు, ఎస్జీఎఫ్ కార్యదర్శి కె.ఎం. నాయుడు, విశాఖ కార్యదర్శి నాగేశ్వరరావు పోటీలను పర్యవేక్షించారు. శనివారం ముగిసిన పోటీల్లో బాలికల విభాగంలో సెమీఫైనల్‌కు చేరుకున్న జట్లు ఖరారు కాగా, బాలుర విభాగంలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. బాలుర విభాగంలో శ్రీకాకుళం, గుంటూరు, విశాఖపట్నం, ప్రకాశం, కర్నూలు, తూర్పు గోదావరి, చిత్తూరు, కడప జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరాయి. బాలికల విభాగంలో చిత్తూరు, విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. చిత్తూరు జట్టు కడపపై 138 పాయింట్లతో భారీ విజయం సాధించింది. విజయనగరం జట్టు ప్రకాశంపై 87 పాయింట్ల తేడాతో, శ్రీకాకుళం జట్టు కృష్ణపై 91 పాయింట్లతో, ఆతిథ్య విశాఖపట్నం జట్టు అనంతపురంపై 95 పాయింట్ల ఆధిక్యంతో గెలుపొందాయి.


