అచ్యుతాపురం రూరల్ : ప్రమాదవశాత్తూ మేడపై నుంచి పడి అలబాని రామకృష్ణ (22) అనే యువకుడు మృతి చెందిన సంఘటన అచ్యుతాపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. లారస్ పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ అచ్యుతాపురం వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే దారిలో ఉన్న మనోహర్ హాస్టల్‌లో మూడో అంతస్తులో నివాసం ఉంటున్నాడు. మంగళవారం ఉదయం సుమారు 5.30 గంటల సమయంలో మూడో అంతస్తుపై నుంచి పడిపోవడం చుట్టుపక్కల వారు కొద్ది సేపటికి గమనించి 108 ఆంబులెన్స్ ద్వారా అచ్యుతాపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం 3 గంటల సమయంలో రామకృష్ణ మృతి చెందాడు. ఘటనపై తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ చంద్రశేఖర్‌రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.


