రైతన్నా.. మీ కోసం.. కష్టాలే సర్వస్వం | - | Sakshi
Sakshi News home page

రైతన్నా.. మీ కోసం.. కష్టాలే సర్వస్వం

Nov 28 2025 8:29 AM | Updated on Nov 28 2025 8:29 AM

రైతన్

రైతన్నా.. మీ కోసం.. కష్టాలే సర్వస్వం

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నుంచి ఆటంకాలే

ఆరంభంలో నకిలీ, పొల్లు విత్తనాలతో ఇబ్బందులు

సకాలంలో వర్షాలు లేక ఆకుమడులు ఎండిపోయే పరిస్థితి

యూరియా, ఎరువుల కొరతతో కష్టాలు

పంట బీమా లేకపోవడంతో ముంచేసిన విపత్తులు

ఇప్పటికీ తుఫాన్‌ పరిహారం కోసం ఎదురుచూపులు

అరకొరగానే ‘అన్నదాత సుఖీభవ’

రైతులకు వెన్నుపోటు పొడిచి.. మీ కోసమంటూ చంద్రబాబు నటన

ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు

సాక్షి, అనకాపల్లి: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుక్షణం నుంచి అన్నదాతకు కష్టాలు మొదలయ్యాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గతంలో కంటే ఈ ఏడాది పంట వేయడం ఆలస్యమైంది. ఖరీఫ్‌కు సిద్ధమైన అన్నదాతకు ఆరంభంలోనే చంద్రబాబు సర్కార్‌ నకిలీ, పొల్లు విత్తనాలతో స్వాగతం పలికింది. అప్పటి నుంచి నేటి వరకూ రైతుకు అన్నీ ఆటంకాలు.. ఎదురు దెబ్బలే. సకాలంలో వర్షాలు పడక ఆకుమడులు ఎండిపోయాయి. వర్షాలు పడ్డాయనుకుంటే నాట్లు వేసినప్పటి నుంచి పొట్ట దశ వరకూ ఈ ఖరీఫ్‌లో యూరియా, డీఏపీ కొరత రైతులను తీవ్రంగా వేధించింది. ఈ ఏడాది రెండు పర్యాయాలు తుపాన్‌ ప్రభావంతో పంట మునకకు గురైంది. ఉచిత పంట బీమా లేకపోవడంతో రైతులు గుండైపె చేయ వేసుకుని ధైర్యంగా వ్యవసాయం చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా రూ.20 వేలు ఇస్తామని ఊదరగొట్టిన చంద్రబాబు సర్కార్‌.. తొలి ఏడాదే ఎగనామం పెట్టింది. ఇక రెండో ఏడాదిలో అరకొరగా..రెండు విడతల్లో రూ.5 చొప్పున రూ.10 వేలతో సరిపెట్టేశారు. రైతులకు అన్నివిధాలా అండగా ఉన్న రైతు భరోసా కేంద్రాల వ్యవస్థను నిర్వీ ర్యం చేశారు. ఆక్వా రంగానికి రూపాయిన్నరకే యూనిట్‌ సబ్సిడీ విద్యుత్‌ ఇస్తామన్న హామీ ఊసేలేదు. ఎన్నికలకు ముందు రైతులకు అనేక హామీలు ఇచ్చి..అధికారం చేపట్టిన తరువాత ఆ హామీలను అమలుచేయకుండా వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు సర్కారు ఇప్పుడు ’రైతన్నా.. మీకోసం’ పేరుతో హడావుడి చేస్తోంది. నీటి భద్రత, డిమాండ్‌ ఆధారిత పంటల సాగు, అగ్రి టెక్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ప్రభుత్వ మద్దతుపై వ్యవసాయ, ఉద్యాన, పట్టు, ఆక్వా, పాడి, పాల్ట్రీ, గొర్రెల పెంపకందారులందరికీ అవగాహన కార్యక్రమాల పేరిట మరో గారడీకి చంద్రబాబు ప్రభుత్వం తెరలేసింది.

ధాన్యం కొనుగోలుపై స్పష్టత కరువు

జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై స్పష్టత లేదు. ఒకవైపు జిల్లాలో పంటలు కోత దశలో ఉన్నాయి. ఇప్పటికే ప్రైవేట్‌ దళారులు ధాన్యం అమ్మాలంటూ రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. కానీ రేట్లు పెంచడం లేదు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియపై రోజుకొక మాట చెబుతోంది. గురువారం ధాన్యం కొనుగోలు ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. కోతలు ప్రారంభం కాలేదంటూ ఆలస్యం చేస్తున్న పరిస్థితులున్నాయి. జిల్లాలో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 1.39 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. ఈ ఖరీఫ్‌లో మొత్తం 92 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. దీని ఆధారంగానే జిల్లాలో 65 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 35 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. అంకితభావంతో ధాన్యం సేకరణ సాగితేనే రైతులకు మేలు జరుగుతుంది.

ఖరీఫ్‌ అంతా కష్టాలే..

ఈ ఏడాది ఖరీఫ్‌ సాగు ప్రారంభంలో వరి విత్తనాలు కోసం రైతు సేవా కేంద్రాల చుట్టూ తిరిగాను. సాగు ప్రారంభించిన తరువాత అధిక వర్షాలతో పంటకు తెగుళ్ల బెడద పట్టుకుంది. సస్యరక్షణ చర్యలకు డబ్బులు ఎక్కువ ఖర్చయ్యాయి. పంటకు అనువైన కాలంలో యూరియా కోసం పడరాని పాట్లు పడ్డాను. ఒక్క బస్తా యూరియా కోసం రోజుల తరబడి కాళ్లరిగేలా తిరిగాం.

– త్రిసూలం ఈశ్వరరావు,

చౌడువాడ గ్రామం

ఎరువుల కొరతతో సతమతం

ఈ ఏడాది ఖరీఫ్‌లో ఎరువుల కొరతతో చాలా ఇబ్బందులు పడ్డాను. వరికి విత్తనాలు పూర్తిగా అందలేదు. కావలసిన వరి రకం విత్తనం సరఫరా చేయలేదు. యూరియా కోసం ఆర్బీకేల దగ్గర పడిగాపులు కాసినా ఇచ్చిన పరిస్థితుల్లేవు. ప్రభుత్వం ఉచిత పంటల బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో విపత్తుల నుంచి పంటను కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడింది.

– పాము అప్పలనాయుడు,

గోవాడ గ్రామం, చోడవరం మండలం

అన్నదాతకు వెన్నుపోటు

● జిల్లాలో 9,173మంది కౌలు రైతులు, 2,100 మంది ఇనాం రైతులకు మొండిచేయి చూపారు. అన్నదాత సుఖీభవ పథకం వీరికి వర్తించకపోవడంతో లబోదిబోమంటున్నారు.

● ఆర్బీకేల పేరు రైతు సేవా కేంద్రాలని మార్చారు గానీ సేవలేవీ కానరావడం లేదు. విత్తనాలు, ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 40కు పైగా ఆర్బీకేలను కుదించేశారు.

● ఖరీఫ్‌ సీజన్‌లో రైతుకు సకాలంలో యూరియా అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యాడు. ప్రభుత్వ వైఫల్యంతో బ్లాక్‌లో అధిక రేట్లకు రైతు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

● గత ప్రభుత్వం రూ.కోటి వ్యయంతో నియోజకవర్గానికి ఒకటి వంతున ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌లు నిరుపయోగంగా ఉన్నాయి. రైతులు శాంపిల్స్‌ తెస్తే చాలు వ్యవసాయం, మత్స్యశాఖ, పశు సంవర్ధక శాఖలకు సంబంధించిన అన్ని పరీక్షలు ఇక్కడ ఉచితంగా చేసేవారు. ఇప్పుడవి కరువయ్యాయి.

● ఆక్వా రైతులందరికీ యూనిట్‌ రూపాయిన్నరకే సబ్సిడీ విద్యుత్‌ అందిస్తామంటూ ఎన్నికల్లో చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు మాట మార్చారు. ఆక్వా జోన్లో వాటికేనంటూ మెలిక పెడుతున్నారు. ఆక్వా రైతులు డ్రాఫ్‌ హాలీడే ప్రకటించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది.

రైతన్నా.. మీ కోసం.. కష్టాలే సర్వస్వం 1
1/3

రైతన్నా.. మీ కోసం.. కష్టాలే సర్వస్వం

రైతన్నా.. మీ కోసం.. కష్టాలే సర్వస్వం 2
2/3

రైతన్నా.. మీ కోసం.. కష్టాలే సర్వస్వం

రైతన్నా.. మీ కోసం.. కష్టాలే సర్వస్వం 3
3/3

రైతన్నా.. మీ కోసం.. కష్టాలే సర్వస్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement