ఏసీబీ వలలో వీఆర్వో
రూ.20 వేలు లంచం తీసుకుంటూ దొరికిన వైనం
అనకాపల్లి: స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం ఒక రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటున్న గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో)ని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ విశాఖపట్నం డీఎస్పీ వీవీఎస్ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం... అనకాపల్లి మండలం మారేడుపూడి, అక్కిరెడ్డిపాలెం పంచాయతీలకు ఎం.సూర్యనారాయణ వీఆర్వోగా పనిచేస్తున్నారు. అక్కిరెడ్డిపాలెం పంచాయతీకి చెందిన రైతు సాలాపు సంజీవరావుకు 3 ఎకరాల 65 సెంట్ల జిరాయితీ భూమి ఉంది. సంజీవరావు ఈ ఏడాది మే 31న అనారోగ్య కారణంగా మృతి చెందారు. భూమిని అతని భార్య సాలాపు దేవుడమ్మ పేరు మీదకు మార్పు (మ్యుటేషన్) చేయాలని సంజీవరావు కుమారుడు సాలాపు శ్రీను అక్కిరెడ్డిపాలెం పంచాయతీ ఇన్‌చార్జ్‌గా విధులు నిర్వహిస్తున్న వీఆర్వో ఎం.సూర్యనారాయణకు సెప్టెంబర్‌లో దరఖాస్తు అందజేశారు. ఇందుకోసం వీఆర్వో రూ.50 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేనని శ్రీను చెప్పడంతో చివరికి రూ.20 వేలు ఇవ్వాలని వీఆర్వో చెప్పారు. లంచం ఇచ్చేందుకు ఇష్టపడని శ్రీను ఈ నెల 26న విశాఖలో ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పథకం ప్రకారం గురువారం ఏసీబీ అధికారులు అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయం గేటు వద్ద మాటు వేసి శ్రీను నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటున్న వీఆర్వో ఎం.సూర్యనారాయణను పట్టుకున్నారు. అతడ్ని విశాఖ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు.


