పోలీసుల వేధింపులకు నిరసనగా మద్యం షాపుల మూసివేత
పరవాడ: స్థానిక లా అండ్ అర్డర్ పోలీసుల వేధింపులు భరించలేక మండలంలోని పరవాడ, వాడచీపురుపల్లి, తానాం గ్రామాల్లో ఆరు మద్యం దుకాణాలను గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు యజమానులు మూసివేశారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారన్న నెపంతో తమపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని వైన్ షాపుల యజమానులు ఆరోపించారు. ఈ క్రమంలో వైన్ షాపుల నిర్వహణ కష్టంగా మారిందని వాపోయారు. ఇలాగైతే ప్రభుత్వానికి చెల్లించాల్సిన కిస్తీలు ఏ విధంగా చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేకే మద్యం షాపులను తాత్కాలికంగా మూసివేసి నిరసన తెలిపినట్లు వెల్లడించారు. మూసిన మద్యం దుకాణాలను వెంటనే తెరవాలని సబ్బవరం ఎకై ్సజ్ సీఐ అనిల్‌కుమార్ ఆదేశాలు జారీ చేసిన అనంతరం, సాయంత్రం వైన్ షాపులను యథావిధిగా తెరిచారు. దీనిపై పరవాడ సీఐ మల్లికార్జునరావును వివరణ కోరగా తాము వైన్ షాపుల యజమానులను అక్రమ వేధింపులకు గురిచేయడం వాస్తవం కాదన్నారు. బహిరంగంగా మద్యం సేవించిన వారిపై, అక్రమ బెల్ట్ షాపుల నిర్వహణదారులపై కేసులు నమోదు చేయడం తమ విధి నిర్వహణలో ఓ భాగమన్నారు. అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే చూస్తూ ఊరుకోబోమని సీఐ మల్లికార్జునరావు హెచ్చరించారు.


