ఆర్టీసీ డ్రైవర్ నిజాయితీ
రావికమతం : ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు పోగొట్టుకున్న బంగారు వస్తువును అతనికి నిజాయితీగా అప్పగించిన బస్సు డ్రైవర్ శ్రీనును పలువురు అభినందించారు. మేడివాడకు చెందిన ముచ్చకర్ల శ్రీను నర్సీపట్నం ఆర్టీసీ డిపోలో ఆవుట్ సోర్సింగ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నర్సీపట్నం–విశాఖపట్నం నాన్ స్టాప్ బస్సులో డ్యూటీ చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం నర్సీపట్నం డిపో నుంచి నాన్ స్టాప్ సర్వీస్ విశాఖపట్నం వెళ్లి, తిరిగి రాత్రి నర్సీపట్నం డిపోకు వస్తుండగా గాజువాకకు చెందిన ఓ వ్యక్తి బస్సులో రూ.75 వేలు విలువగల బంగారు శతమానం పోగొట్టుకున్నాడు. ప్రయాణికుడు ఇంటికి వెళ్లి చూసుకోగా సంచిలో శతమానం లేకపోవడంతో వెంటనే నర్సీపట్నం డిపో యాజమాన్యంకు సమాచారం అందించాడు. అప్పటికే బస్సు నర్సీపట్నం డిపోకు చేరుకుంది. డ్రైవర్ శ్రీను బస్సు దిగే ముందు బంగారు శతమానం కనిపించింది, దానిని తీసుకొని కౌంటర్ వద్దకు అప్పగించేందుకు వెళ్లగా అదే సమయంలో వస్తువు పోగొట్టుకున్న ప్రయాణికుడికి సంబంధించిన వ్యక్తి రావడంతో ఆతడికి అందజేశారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీను నీజాయితీని అందరూ అభినందించారు.
ఆర్టీసీ డ్రైవర్ నిజాయితీ


