పడమటమ్మ వార్షికోత్సవానికి భారీ ఏర్పాట్లు
కశింకోట: పడమటమ్మ సారె ఊరేగింపు కశింకోటలో ఆదివారం ఘనంగా జరిగింది. అమ్మవారి వార్షికోత్సవం విసన్నపేటలో సోమవారం జరగనుంది. దీన్ని పురస్కరించుకొని అమ్మ వారి విగ్రహాన్ని స్థానిక ఉప్పునీటి దిబ్బ వినాయకుని ఆలయం వద్ద నెలకొల్పి నవ రాత్రి పూజలు నిర్వహించారు. అవి పూర్తి కావడంతో అమ్మ వారి విగ్రహాన్ని ట్రాక్టర్‌పై నిలిపి బాసంచా కాలుస్తూ డప్పులు, వాయిద్యాలతో సంప్రదాయంగా సారె ఊరేగింపు నిర్వహించారు. మహిళలు తయారు చేసిన లడ్డూలు, బూరెలు, గారెలు, రవ్వ ఉండలు, అరిసెలు, చినిపాకులు, పూత రేకులు, జంతికలు, గులాబీ పువ్వులు, తదితర వంటకాలు, కొబ్బరి బొండాలు, కమల, యాపిల్, సీతాఫలం తదితర పండ్ల పళ్లాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఉప్పునీటి దిబ్బ నుంచి ప్రారంభమైన ఊరేగింపు కస్పావీధి, పెద్ద బజారు, సంతబయల, పూసర్ల వీధి, స్టేట్ బ్యాంకు, అమరపల్లి వీధి మీదుగా సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహిళల కోలాటాలు, తాడేపల్లి గూడెంకు చెందిన కాళికా నృత్య ప్రదర్శన ఆహూతులను విశేషంగా అలరించాయి. అనంతరం ఉప్పునీటి దిబ్బ వద్ద భారీ అన్న సమారాధన నిర్వహించారు. సాయంత్రం పడమటమ్మ విగ్రహాన్ని అక్కడి నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లి గాడి వీధిలో శారదా నదిలో సంప్రదాయంగా పూజలు చేసి నిమజ్జనం చేశారు. మాల ధారణ చేసి అమ్మ వారి భక్తుల, మహిళలు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాడేపల్లిగూడేనికి చెందిన
బృందం కాళిక నృత్య ప్రదర్శన
వైభవంగా సారె ఊరేగింపు
వైభవంగా సారె ఊరేగింపు


