ఉక్కుపై ఉమ్మడి దాడి
ఉత్పత్తి లక్ష్యాల నిష్పత్తి మేరకే జీతాలని యాజమాన్యం ప్రకటన అదే సమయంలో ఉద్యోగులు పని చేయాలంటూ చంద్రబాబు వ్యాఖ్యలు ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర మండిపడుతున్న ఉద్యోగ సంఘాల ఐకాస ప్రతినిధులు నేడు అడ్మిన్ బిల్డింగ్ వద్ద మహా ధర్నా
చంద్రబాబుకు ముందే తెలుసా?
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఎలా గాడిలో పెట్టాలన్న దానిపై ఆలోచనలు చేయకుండా.. ఉక్కు భవిష్యత్తు కోసం దశాబ్దాలుగా శ్రమిస్తున్న ఉద్యోగులు, కార్మికులపై యాజమాన్యం కొరడా ఝుళిపిస్తూనే ఉంది. కార్మికులను తొలగించడం, ఉద్యోగులకు పూర్తిస్థాయి వేతనాలు చెల్లించకపోవడం, ఉద్యమించిన వారిపై షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా, ఉత్పత్తి లక్ష్యాలకు చేరుకుంటేనే జీతాలు చెల్లిస్తామంటూ యాజమాన్యం జారీ చేసిన సర్క్యులర్ కలకలం రేపుతోంది.ఇదే సమయంలో చంద్రబాబు కూడా ఉద్యోగులు జీతాలు తీసుకుంటూ పనిచేయడం లేదన్నట్లుగా వ్యాఖ్యలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ సర్క్యులర్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కావాలనే జారీ చేశాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఉద్యోగులను కించపరిచేలా మాట్లాడటం చూస్తుంటే.. ఉద్యోగులను ఆర్థిక పరంగా దెబ్బతీసి, పొమ్మనకుండా పొగబెట్టడంలా ఈ వ్యవహారం ఉందంటూ ఉద్యమ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జీతాల చెల్లింపులపై మరో మెలిక?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అడ్డగోలు చర్యలతో ఇప్పటికే అనేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న స్టీల్‌ప్లాంట్.. ఉద్యోగులకు జీతాలు సక్రమంగా చెల్లించలేని దుస్థితికి చేరుకుంది. నెలల తరబడి జీతాలు బకాయిలుగా ఉంచి, ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చేసింది. ఇప్పటికీ 100 శాతం జీతాలు ఇవ్వడంలో విఫలమవుతూనే ఉంది. ఇటు ప్రజలు, అటు ఉద్యోగుల ఆందోళనలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నిరసనలను ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఎన్ని కుయుక్తులు పన్నుతున్నా వెరవకుండా ఏళ్ల తరబడి ఉద్యమాలు చేస్తూ.. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకునేందుకు శ్రమిస్తున్న ఉద్యోగులు, కార్మికుల ఆర్థిక మూలాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దెబ్బకొడుతున్నాయి. పోరాటం చేస్తున్న వారి ఆత్మస్థైర్యాన్ని, ఆర్థిక ఆసరాను ఛిద్రం చేస్తే.. ఉద్యమాన్ని నీరుగార్చవచ్చన్న కుతంత్రంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న విషయం జీతాల చెల్లింపులతో బట్టబయలవుతోంది. తాజాగా జారీ చేసిన సర్క్యులర్ మరింత ఆజ్యం పోస్తోంది. ఉత్పత్తి లక్ష్యాలకు అనుగుణంగా జీతాల చెల్లింపులు ఉంటాయని స్పష్టం చేయడం ఆందోళన కలిగిస్తోంది.
సర్క్యులర్ జారీ సమయంలోనే బాబు వ్యాఖ్యలు
యాజమాన్యం సర్క్యులర్‌పై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, అదే సమయంలో చంద్రబాబు ఇదే అంశాన్ని స్ఫురించేలా వ్యాఖ్యలు చేయడం అనేక విమర్శలకు తావిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే కూడబలుక్కొని ఈ తరహా నిర్ణయాలు తీసుకొని, ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వేల మంది కార్మికులను అర్ధాంతరంగా తొలగించి, వారిని, నమ్ముకున్న కుటుంబాలను నడిరోడ్డున పడేసిన యాజమాన్యం ఈ తరహా వైఖరి అవలంబించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు పని చేయకుండా జీతాలెలా ఇస్తారన్నట్లుగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అగ్గి మీద గుగ్గిలంలా మారాయి. స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులపై చంద్రబాబు పరుషంగా మాట్లాడటం, అదే సమయంలో యాజమాన్యం సర్క్యులర్ విడుదల చేయడం అంతా ఒక ప్రణాళిక ప్రకారమే జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసిస్తూ, అదే సమయంలో స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం జీతాల చెల్లింపులపై అడ్డగోలు సర్క్యులర్ జారీ చేయడంపై సోమవారం స్టీల్‌ప్లాంట్ ప్రధాన పరిపాలన భవనం ఎదుట మహా ధర్నా నిర్వహించాలని అఖిలపక్ష కార్మిక సంఘాలు నిర్ణయించాయి.
ఎన్నడూ లేని లక్ష్యాలిచ్చి..!
లక్ష్యాలు చేరుకుంటేనే పూర్తి వేతనం చెల్లిస్తామని శనివారం ఉక్కు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేయడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. సర్క్యులర్ ప్రకారం.. సింటర్ ప్లాంట్‌లో రోజుకు 24,000 టన్నుల సింటర్, బ్లాస్ట్ ఫర్నెస్‌లో రోజుకు 19,000 టన్నుల హాట్ మెటల్, ఎస్‌ఎంఎస్ 1, 2లలో రోజుకు 125 హీట్లు, కోక్‌ఓవెన్ రోజుకు సగటున 370 పుషింగ్స్, రోలింగ్ మిల్స్‌లో సగటున రోజుకు 13,500 టన్నుల రెడీ ప్రొడక్ట్స్, మార్కెటింగ్ విభాగానికి రోజుకు సగటున 15,000 టన్నుల అమ్మకాలు నిర్దేశిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఈ ఉత్పత్తి లక్ష్యాలను ఎంతమేర చేరుకుంటారో, అంత శాతం మాత్రమే వేతనాల చెల్లింపులు జరుగుతాయని యాజమాన్యం స్పష్టం చేసింది. అంటే లక్ష్యం ప్రకారం 19 వేల హాట్‌మెటల్ కాగా, రోజుకు 90 శాతం మాత్రమే వస్తే, నెలవారీ సగటును గణించి, ఆ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే ఉద్యోగులకు మొత్తం జీతంలో 90 శాతం మాత్రమే ఇస్తారు. ఒకవేళ 50 శాతం జరిగితే, 50 శాతం జీతంలో కోత విధిస్తామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.


