సీఎం వ్యాఖ్యలు కార్మిక వ్యతిరేకం
విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికులను
అవమానించారు: సిటు
అనకాపల్లి: స్టీల్‌ప్లాంట్ కార్మికులు పనిచేయకపోవడం వల్లే పరిశ్రమ నష్టాల బారిన పడిందని, కష్టపడకుండా తెల్ల ఏనుగులా కార్మికులు మారారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎద్దేవా చేయటం అత్యంత దుర్మార్గమని, ఈ వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు తక్షణమే వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వివి శ్రీనివాసరావు, ఆర్.శంకర్‌రావులు అన్నారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు ఇవ్వకుండా, ఎక్కువ ఖర్చవడం మూలంగానే స్టీల్‌ప్లాంట్‌కు భారంగా మారిందన్న విషయం తెలిసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విధంగా వ్యాఖ్యలు చేయటం అత్యంత దుర్మార్గమన్నారు. జిల్లాలో మిట్టల్ స్టీల్‌ప్లాంట్ ప్రారంభం కాకుండానే సొంత గనుల కోసం ప్రధానితో మాట్లాడి తీసుకొస్తున్నానని ఘనంగా చెప్పడంతో పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు కూటమి ప్రభుత్వం ఏ విధంగా దాసోహం అయిందో అర్థం అవుతుందన్నారు. 32 మంది ప్రాణత్యాగంతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సాధించుకుంటే, దానిని విస్మరించి చంద్రబాబునాయుడు మిట్టల్ సంస్థకు దాసోహం అయ్యారన్నారు. సిటు జిల్లా కమిటీ సభ్యుడు కె.ఈశ్వరరావు పాల్గొన్నారు.
కార్మికులను బెదిరించడం సరికాదు
విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికులపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విమర్శలు అత్యంత బాధాకరమని, వాస్తవాలకు విరుద్ధమని, ఉక్కు కార్మికులను ’తెల్ల ఏనుగులు’ అంటూ అవమానించడం దుర్మార్గమని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న వేలాది కార్మికుల కష్టాన్ని, త్యాగాన్ని గుర్తించకుండా ఇలాంటి చౌకబారు వాక్యాలు చేయడం కూటమి ప్రభుత్వానికి తగదన్నారు. ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు, సొంత గనులు లేకపోవడం, ఇతర పాలనాపరమైన కారణాల వల్ల నష్టాలు వస్తుంటే నెపం కార్మికులపై నెట్టడం దారుణమన్నారు. ప్రతిపక్షంలో ఉండగా విశాఖ ఉక్కు కార్మికుల ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ మద్దతుగా నిలిచిందని, మరి ఇంతలోనే కార్మికులు పనిచేయకుండా తెల్ల ఏనుగును చేసేశారని ముఖ్యమంత్రి అనడం సరైనది కాదన్నారు. కార్మికుల సమస్యలు వినకుండా వారిపై ‘పీడీ యాక్ట్ పెట్టి లోపల వేస్తాం‘ అని ముఖ్యమంత్రి బెదిరించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.


