బస్సు వెనుక భాగంలో పొగలు
ఆందోళనకు గురైన ప్రయాణికులు
మునగపాక: మండల కేంద్రం మునగపాకలో ఓ ఆర్టీసీ బస్సు వెనుక భాగంలో అకస్మాత్తుగా పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అనకాపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు గురువారం ఉదయం అనకాపల్లి నుంచి రాంబిల్లి మండలం కొత్తపట్నం చేరుకుని, తిరుగు ప్రయాణంలో ప్రయాణికులతో అనకాపల్లి వస్తుండగా మునగపాక జంక్షన్ పీఏసీఎస్ ఎదురుగా వద్ద బస్సు వెనుక భాగాన టైరుకు సమీపంలో యాక్సిల్ బాగా వేడెక్కడంతో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. గమనించిన స్థానికులు బస్సు డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. దీంతో ప్రయాణికులను కిందకు దించేశారు. యాక్సిల్ వేడి టైరు తగలడంతో పొగలు రావడంతో పాటు వాసన వచ్చింది. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అక్కడ నుంచి ప్రైవేట్ వాహనాల్లో గమ్యస్థానాలకు చేరుకున్నారు.


