దివ్యాంగులను వేధించడం తగదు
మహారాణిపేట(విశాఖ): దివ్యాంగుల పింఛన్ల కోసం తరచూ విచారణలు నిర్వహించి, ఆస్పత్రుల చుట్టూ తిప్పడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైరపర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన జరిగిన స్థాయీ సంఘాల సమావేశంలో వారు మాట్లాడారు. దీనిలో భాగంగా అనంతగిరి జెడ్పీటీసీ గొలుగొండ జెడ్పీటీసీ సభ్యుడు గిరిబాబు మాట్లాడుతూ దివ్యాంగులను విచారణపేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. దీనిపై చైర్‌పర్సన్ జె.సుభద్ర జోక్యం చేసుకుంటూ.. దివ్యాంగులను వేధించడం సరికాదన్నారు. కొత్తగా ఎన్ని పింఛన్లు ఇచ్చారని, వితంతు పింఛన్ల మంజూరులో జాప్యం ఎందుకవుతోందని అధికారులను ప్రశ్నించారు.
గ్యాస్ రాయితీ డబ్బులు జమ కావడం లేదు
గ్యాస్ సిలిండర్ రాయితీ నగదు రెండు నెలలు దాటినా ఇంకా ఖాతాల్లో జమ కాలేదని కె.కోటపాడు జెడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధ ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్పుడు వేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి ఈకేవైసీ పూర్తి చేయకపోవడం, బ్యాంకు ఖాతాలు ఆధార్‌తో అనుసంధానం కాకపోవడం కారణమని ఏఎస్‌వో కల్యాణి వివరణ ఇచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి విరుద్ధంగా ‘తల్లికి వందనం’పథకంలో నగదు అందరికీ వేయడం లేదని, వేసిన మొత్తంలో కోత విధిస్తున్నారని ఈర్లె అనురాధ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తి మొత్తం ఇచ్చారని, ఇప్పుడు సగం ఇవ్వడం వల్ల పేద కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయన్నారు. పీహెచ్‌సీలు, ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు లేవని, అత్యవసర మందులు కూడా లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని అనురాధ తెలిపారు.
గుంతలు పూడ్చండి
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, వర్షాల వల్ల గుంతలు పెరిగి ప్రయాణం కష్టంగా మారిందని గొలుగొండ జెడ్పీటీసీ సభ్యుడు గిరిబాబు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. గుంతలు పూడ్చడానికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పాడేరు, అరకు ప్రాంతాల్లోని ఆశ్రమ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు అనారోగ్యంతో మరణిస్తున్నారని, పరిశుభ్రమైన నీరు ఇవ్వడం లేదని అనంతగిరి జెడ్పీటీసీ సభ్యుడు గంగరాజు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకుని, గిరిజన విద్యార్థుల ఆరోగ్యం కాపాడాలని డిమాండ్ చేశారు.
గృహ నిర్మాణ బిల్లుల చెల్లింపులు ఎప్పుడు?
గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి, నిర్మాణం పూర్తి చేసిన ఇళ్ల లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదని ఆనందపురం జెడ్పీటీసీ సభ్యుడు కోరాడ వెంకటరావు అన్నారు. వేములవలసలో నిర్మించిన ఇళ్లకు బిల్లులు ఇవ్వలేదని ఆయన ప్రస్తావించారు. అనంతగిరి జెడ్పీటీసీ సభ్యుడు డి.గంగరాజు సైతం గృహ నిర్మాణ బిల్లుల చెల్లింపుపై ప్రశ్నించారు. ఇళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ బిల్లులు ఇవ్వడం లేదని, కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని పేర్కొన్నారు.
ఆశ కార్యకర్తల పోస్టులను రద్దు చేయండి
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆశ కార్యకర్తల పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయని, అనర్హులకు పోస్టులు ఇచ్చారని అరకు, అనంతగిరి జెడ్పీటీసీ సభ్యులు రోషిణి, గంగరాజు ఆరోపించారు. ఈ పోస్టులను తక్షణం రద్దు చేసి, మళ్లీ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డీఎంహెచ్‌వో పాత్రపై విచారణ చేయాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రల్లో అత్యవసర మందులు కూడా అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఈర్లె అనురాధ తెలిపారు.
అరకు, పాడేరుపై వివక్ష
అరకు, పాడేరు నియోజకవర్గాలపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోందని, ఇక్కడ మండల లెవిల్ స్టాక్ పాయింట్లను జీసీసీ నుంచి రెవెన్యూకు అప్పగించడం వంటి అదనపు పద్ధతులు పెట్టారని, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఉండడం వల్లే ఈ వివక్ష చూపుతున్నారని జెడ్పీ చైర్‌పర్సన్ జె.సుభద్ర విమర్శించారు.
దివ్యాంగులను వేధించడం తగదు
దివ్యాంగులను వేధించడం తగదు


