సభ్యుల సొమ్ము ‘గోవిందా’! | - | Sakshi
Sakshi News home page

సభ్యుల సొమ్ము ‘గోవిందా’!

Nov 7 2025 7:02 AM | Updated on Nov 7 2025 7:02 AM

సభ్యుల సొమ్ము ‘గోవిందా’!

సభ్యుల సొమ్ము ‘గోవిందా’!

ఏపీ ఈపీడీసీఎల్‌ కో–ఆపరేటివ్‌

సొసైటీలో రూ.20 కోట్ల మోసం?

సభ్యులకు తెలియకుండా ఒక్కొక్కరి పేరుతో రూ.15 లక్షల వరకు రుణాలు

వీటన్నింటినీ ఓ మాజీ డైరెక్టర్‌ స్వాహా చేసినట్లుగా ఆరోపణలు

సాక్షి, విశాఖపట్నం: వచ్చిన జీతంలో కొంత మొత్తం దాచుకుంటే భవిష్యత్‌లో ఉపయోగపడుతుందని ఉద్యోగులు భావించారు. కానీ, తాము దాచుకున్న సొమ్ములు సొసైటీ డైరెక్టర్లకు ఉపయోగపడుతున్నాయని ఆలస్యంగా తెలుసుకున్నారు. ఈపీడీసీఎల్‌ పరిధిలోని విద్యుత్‌ ఉద్యోగుల కో–ఆపరేటివ్‌ సొసైటీలో కొందరు డైరెక్టర్లు తమ చేతివాటం ప్రదర్శించారు. సొసైటీ సభ్యుల పేరుతో రుణాలు తీసుకుని, తమ జేబులు నింపేసుకున్నారు. సభ్యులకు తెలీకుండా ఒక్కొక్కరి పేరిట రూ.15 లక్షల వరకు కాజేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ సర్కిల్‌ పరిధి సొసైటీలోని మాజీ డైరెక్టరే ఈ స్వాహా పర్వానికి మూలకారకుడనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఆడిట్‌కు ఫిర్యాదు చేసినా.. మేనేజ్‌ చేసుకుంటూ దర్జాగా సభ్యుల సొమ్ముకు కుచ్చుటోపీ పెడుతున్నట్లు తెలుస్తోంది.

ఈపీడీసీఎల్‌లో ఉద్యోగులంతా కలిసి ఓ సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు. విశాఖపట్నం సర్కిల్‌ పరిధిలో మూడు విద్యుత్‌ ఉద్యోగుల కో–ఆపరేటివ్‌ సొసైటీ బ్రాంచ్‌లు ఉన్నాయి. అవి విశాఖపట్నం సర్కిల్‌, గాజువాక, గోపాలపట్నం. ఒక్కో బ్రాంచ్‌ సొసైటీకి అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు ఉద్యోగుల సంఖ్యను బట్టి 7 నుంచి 9 మంది డైరెక్టర్లు ఉంటారు. ఈ బ్రాంచ్‌లలో గాజువాక శాఖ అతి పెద్దది. ఇందులో ఈపీడీసీఎల్‌తో పాటు చింతపల్లి, సీలేరులోని జెన్‌కో ఉద్యోగులు కూడా సభ్యులుగా ఉన్నారు. అయితే, గత నాలుగేళ్లుగా విశాఖపట్నం ఈపీడీసీఎల్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఉన్న సొసైటీ బ్రాంచ్‌ ఆఫీస్‌ నుంచి సభ్యుల సొమ్ములు స్వాహా అవుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ బ్రాంచ్‌లో గతంలో డైరెక్టర్‌గా వ్యవహరించిన ఓ వ్యక్తి ఉద్యోగుల సొమ్ముని గుట్టుగా స్వాహా చేసినట్లుగా తెలుస్తోంది.

ఒక్కో సభ్యుడి పేరుతో

రూ.15 లక్షలకు పైగానే.!

ఈపీడీసీఎల్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌ హోదాలో ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగి గతంలో సొసైటీలో ఒక డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆ సమయంలోనే సభ్యుల పేరుతో సొమ్ములు గోవిందా.. గోవిందా అంటూ ఆరగించేసినట్లు తెలుస్తోంది. సొసైటీలో ఉన్న ఒక్కో సభ్యుడి పేరుతో సదరు డైరెక్టర్‌ రూ.15 లక్షలకు పైగా రుణాలు తీసుకొని, సొంతంగా వాడుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 30 మందికి పైగా సభ్యులు ఈ డైరెక్టర్‌ బాధితులుగా మారినట్లు సమాచారం. రుణాలు తీసుకొని ఎంచక్కా.. డైరెక్టర్‌ పోస్టు నుంచి తప్పుకుని ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటున్నారు. అయితే.. ఇటీవల కొంత మంది సభ్యులు తమ డివిడెంట్లు, షేర్‌ క్యాపిటల్‌ ఫండ్స్‌, ఇతరత్రా ఆదా చేసిన డబ్బులు గురించి ఆరా తీస్తున్న సమయంలో అప్పటి డైరెక్టర్‌ బండారం ఒక్కొక్కటిగా బయటపడినట్లు సమాచారం. ఈ విషయంపై సొసైటీ అధ్యక్ష కార్యదర్శులకు కొందరు బాధిత సభ్యులు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ఆర్థిక మోసం బయటకు రాకుండా గోప్యంగా ఉంచాలనీ, ఎలాగైనా కొల్లగొట్టిన సొమ్ములు తిరిగి చెల్లించేందుకు ప్రయత్నిస్తామంటూ వారు హామీ ఇచ్చారు. సభ్యులు మాత్రం.. తమకు నమ్మకం లేదనీ, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం.

గతంలో ఉద్యోగాల

పేరుతో మోసం

సొసైటీ సభ్యుల పేరుతో రుణాలు తీసుకొని సొంత ఖాతాకు మళ్లించుకున్న సదరు మాజీ డైరెక్టర్‌పై గతంలోనూ అనేక ఆరోపణలున్నాయి. ఈపీడీసీఎల్‌ పరిధిలో ఎనర్జీ అసిస్టెంట్‌ పోస్టులు ఇప్పిస్తానంటూ పదుల సంఖ్యలో నిరుద్యోగులను మోసం చేశారు. దాదాపు రూ.5 కోట్ల వరకు వసూళ్లు చేసిన డైరెక్టర్‌పై అప్పట్లో కేసులు నమోదవ్వడంతో.. విధుల నుంచి కూడా సస్పెండ్‌ చేశారు. అయినా తన వక్రబుద్ధిని వదులుకోలేకపోతున్న ఆయన.. సొంత డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల సొమ్మునూ వదల్లేదు. ఇలాంటి వ్యక్తికి అప్పట్లో డైరెక్టర్‌ పదవిని ఎందుకు కట్టబెట్టామా అంటూ సొసైటీ సభ్యులు ఇప్పుడు బాధపడుతున్నారని విద్యుత్‌ ఉద్యోగులు అంటున్నారు. సొసైటీలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement