ఆరు లేన్లుగా జాతీయ రహదారి
రూ.3,800 కోట్లతో విస్తరణ
డీపీఆర్‌కు కేంద్రం ఆమోదం
త్వరలో పనులు ప్రారంభం
అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు
160 కిలోమీటర్ల మేర పనులు
నక్కపల్లి: ప్రస్తుతం నాలుగు లేన్లగా ఉన్న 16 వ నంబరు జాతీయరహదారిని ఆరులేన్లగా విస్తరించేందుకు రంగం సిద్ధమైంది. అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు ఈ రహదారి విస్తరణకు నేషనల్ హైవేఆథారిటీ ఆఫ్ ఇండియా రూ.3,800 కోట్లతో రూపొందించిన డీపీఆర్‌కు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఇటీవల కేంద్ర రహదారుల మంత్రిత్వశాఖ కూడా ఈ జాతీయరహదారిని ఆరులేన్లుగా విస్తరించే పనులు త్వరలో ప్రారంభమవుతాయని ప్రకటించింది. ఎప్పుడో బ్రిటీష్ వారి హయాంలో కోల్‌కతా, చైన్నె మధ్య సింగిల్ రోడ్డుగా ఏర్పాటు చేసిన ఈ రహదారిని 30 ఏళ్ల కిందట నాలుగు లేన్లుగా విస్తరించారు. దీంతో కోల్‌కతా, చైన్నె మధ్య, ఆంధ్రా సరిహద్దు అయిన ఇచ్ఛాపురం నుంచి అటు తమిళనాడు సరిహద్దులో ఉన్న తడ వరకు రాకపోకలకు కొంత సులభతరమైంది. ప్రయాణ సమయం కూడా తగ్గింది. అయితే రవాణా సమయాన్ని మరింత తగ్గించడంతోపాటు, ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా కేంద్రప్రభుత్వం నాలుగు లేన్ల రహదారిని ఆరులేన్లుగా విస్తరించే పనులు చేపట్టింది. ఇప్పటికే రాజమండ్రినుంచి విజయవాడ వరకు ఆరులేన్ల విస్తరణ పనులు పూర్తయ్యాయి. అనకాపల్లి నుంచి ఇచ్ఛాపురం వరకు సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా ఆరులేన్ల రోడ్డు నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. అనకాపల్లినుంచి రాజమండ్రి మధ్య మిగిలిన పనులకు త్వరలో శ్రీకారం చుట్టనున్నట్టు సమాచారం. ఈ విస్తరణ పనుల్లో భాగంగా అనకాపల్లినుంచి తుని వరకు 68.645 కిలోమీటర్లు, కాకినాడ జిల్లాలో తుని నుంచి రాజమండ్రి సమీపంలో ఉన్న దివాన్ చెరువు వరకు (పత్తిపాడు, జగ్గంపేట,రాజానగరం మండలాలను కవర్‌చేస్తూ) 81 కిలోమీటర్లు, దివాన్ చెరువు నుంచి రాజమండ్రి పట్టణాన్ని కవర్‌చేస్తూ మరో 11 కిలోటర్ల వరకు ఆరులేన్లుగా విస్తరించనున్నారు. ఈ రహదారి విస్తరణ కోసం రూ.3,800 కోట్లలో డీటైల్ ప్రాజెక్టు రిపోర్టు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడంతో ఆమోదం లభించినట్లు తెలిసింది. అనకాపల్లి, తుని సెక్షన్‌లో(67), అలాగే తుని రాజమండ్రి సెక్షన్‌ల మధ్య(103)పైప్ కల్వర్టులు, బాక్స్‌కల్వర్టులు, మేజర్ బ్రిడ్జిలు, మైనర్ బ్రిడ్జిలు నిర్మిస్తారు. ఈ రెండు సెక్షన్ల మధ్య ఉన్న పాతబ్రిడ్జిలకు మైనర్, మేజర్ మరమ్మతులు కూడా చేపట్టనున్నట్లు డీపీఆర్‌లో పేర్కొన్నారు. అవసరమైన చోట్లకొత్త వంతెను, అప్రోచ్‌రోడ్లను నిర్మించనున్నట్లు తెలిసింది.
వాహనాల పార్కింగ్‌కు స్థలం కేటాయించాలి
జాతీయరహదారి పై రాకపోకలు బాగా పెరిగాయి. నాలుగులేన్లుగా ఉన్న ప్రస్తుత రోడ్డుపై నిత్యం వేలల్లో వాహనాలు రాకపోకలు సాగించడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అప్రోచ్‌రోడ్లు, బెర్మ్‌లు కూడా సరిగా లేవు. ఈ రోడ్డును ఆరులైన్లుగా విస్తరిస్తే ప్రయాణ సమయం ఆదాకావడంతోపాటు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. అలాగే వాహనదార్లకు నిర్వహణ ఖర్చుకూడా తగ్గుతుంది.రోడ్డువిస్తరణ సందర్భంగా వాహనాల పార్కింగ్‌కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించి డ్రైవర్లకు విశ్రాంతి గదులు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
–పోతంశెట్టిబాబ్జి, నక్కపల్లి
వ్యాపారులకు నష్టం లేకుండా చూడాలి
వ్యాపారులకు నష్టం లేకుండా మండల కేంద్రం నక్కపల్లిలో ఆరులేన్ల రోడ్డు విస్తరణ చేపట్టాలి. మండల కేంద్రాన్ని నమ్ముకుని చాలా మంది చిరువ్యాపారాలు చేసుకుంటున్నారు.నక్కపల్లిలో బైపాస్ నిర్మిస్తే వీరంతా ఉపాధి కోల్పొయే అవకాశం ఉంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని విస్తరణ చేపట్టాలి. –ఎల్లేటిసత్తిబాబు, నక్కపల్లి
తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ఖర్చు
వేంపాడు టోల్‌ప్లాజా లెక్కల ప్రకారం అనకాపల్లి నుంచి రాజమండ్రి మధ్యలో ప్రతిరోజు అన్నిరకాల వాహనాలు కలిపి 15వేల వరకు రాకపోకలు సాగిస్తుంటాయి. జాతీయరహదారి ఆరులేన్లుగా విస్తరణపూర్తయితే, శ్రీకాకుళం నుంచి విజయవాడ, అక్కడనుంచి నెల్లూరు జిల్లా తడ వరకు ప్రయాణ సమయం మరింత తగ్గడంతోపాటు, రోడ్డుప్రమాదాలు తగ్గేఅవకాశం ఉంది. ముఖ్యంగా అనకాపల్లి, రాజమండ్రి మధ్య ప్రయాణ సమయం మరింత తగ్గుతుంది. దీంతో వాహనాలు వినియోగించే పెట్రోలు, డీజిల్, వాహనాల నిర్వహణ ఖర్చు ఆదా అవుతాయి. వాహనాల యజమానులపై ఆర్థిక భారం కొంతమేర తగ్గుతుంది. అయితే విస్తరణలో భాగంగా కొన్ని ప్రాంతాల్లో భూసేకరణ జరపాల్సి ఉంది. ముఖ్యంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న మండల కేంద్రం నక్కపల్లి పట్టణంలో ఆరులేన్ల విస్తరణకు భూసేకరణ జరపాల్సి ఉంటుంది. బైపాస్‌రోడ్డు నిర్మిస్తారా, లేక ఫైఓవర్ నిర్మిస్తారా అన్న సందిగ్ధం నెలకొంది. పట్టణంలో రోడ్డు విస్తరణ కోసం ఇళ్లను, నివాస ప్రాంతాలను సేకరించాలంటే భారీ ఖర్చుతో కూడుకున్న పని. దీంతో నక్కపల్లిలో బైపాస్ నిర్మిస్తారన్న ప్రచారం జరుగుతోంది. వెదుళ్లపాలెం నుంచి నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వరకు గురుకుల పాఠశాల వెనుక భూసేకరణ జరిపి ఆరులైన్లు రోడ్డు నిర్మించే యోచనలో ఉన్నట్లు సమాచారం. అలాగే కశింకోట, నర్సింగపల్లి ప్రాంతాల్లో కూడా రోడ్డుకు ఇరువైపులా ఇళ్లను, వాణిజ్య సముదాయాలను ఖాళీచేయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
జిల్లాలో నాలుగు భారీ వంతెనలు
అనకాపల్లి, రాజమండ్రి మధ్య విస్తరించే ఈ ఆరులేన్ల రహదారి మధ్యలో అనకాపల్లి జిల్లాలో నాలుగు మేజర్ వంతెనలు, మూడు ఫ్లైఓవర్స్, మూడు రైలు కం రోడ్డు వంతెనలు నిర్మించనున్నారని ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు ద్వారా తెలిసింది. ఈ విస్తరణ పనులు మరో మూడు నెలల్లో ప్రారంభించి, రెండేళ్లలో పూర్తిచేయనున్నట్టు సమాచారం.
ఆరు లేన్లుగా జాతీయ రహదారి
ఆరు లేన్లుగా జాతీయ రహదారి
ఆరు లేన్లుగా జాతీయ రహదారి
ఆరు లేన్లుగా జాతీయ రహదారి


