 
															భూ ఆక్రమణలపై తహసీల్దార్ కార్యాలయం ముట్టడి
పోలేపల్లిలో భూకబ్జాపై గ్రామస్తుల ఆగ్రహం
బుచ్చెయ్యపేట: మండలంలోని పోలేపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు బుధవారం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. సర్వే నంబర్ 156లో 216 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇటీవల గ్రామానికి చెందిన కూటమి నేతలు పొక్లెయిన్‌తో ఆ భూమిని చదును చేసి సుమారు 30 ఎకరాలను ఆక్రమించి యూకలిప్టస్ మొక్కలు నాటారు. మండలానికి మంజూరైన మోడల్ స్కూల్ నిర్మాణానికి కేటయించి, శిలాఫలకం వేసిన స్థలాన్ని కూడా కూటమి నేతలు ఆక్రమించారు. ఇందులో కొంత భూమిని చైన్నెకి చెందిన వ్యక్తికి విక్రయించగా , మరికొంత భూమిని విక్రయించేందుకు బేరానికి పెట్టారు. గ్రామంలో పలువురు సెంటు భూమి లేని నిరుపేదలుండగా బడాబాబులు, కూటమి నేతలు ప్రభుత్వ భూమిని ఆక్రమించడంపై గ్రామస్తులు మండిపడ్డారు. ఇటీవల సర్పంచ్ సీతా బుజ్జితో పాటు పలువురు ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురి కాకుండా చూడాలని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. భూ ఆక్రమణలకు పాల్పడిన కొంతమంది సర్పంచ్ కుటుంబ సభ్యులు, సర్పంచ్‌కు దన్నుగా ఉన్నవారిపై ఇటీవల దౌర్జన్యం చేశారు. దీనిపై ఆగ్రహించిన గ్రామానికి చెందిన మల్లోతు జోగినాయుడు, పెంటయ్య, పర్రె శివ, గాడి చిన్న, తుంపాల అప్పారావు, సీతా జోగినాయుడు తదితరులు బుచ్చెయ్యపేట తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశారు. నిరు పేదలకు ఇళ్ల స్థలాలు, భూ పట్టాలు అందించాలని, ఇతర ప్రజా ప్రయోజనాలకు ప్రభుత్వ భూమిని వినియోగించాలని నినాదాలు చేశారు. భూ ఆక్రమణలు తొలగించాలని తహసీల్దార్ గదిని ముట్టడించారు. తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది ఫోన్‌లో సమాచారం అందజేశారు. తుఫాన్ ప్రభావం తగ్గిన వెంటనే గ్రామానికి వచ్చి, భూ ఆక్రమణలను తొలగిస్తామని తహసీల్దార్ లక్ష్మి హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. వారం రోజుల్లో భూ ఆక్రమణలు తొలగించకపోతే తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.
 
							భూ ఆక్రమణలపై తహసీల్దార్ కార్యాలయం ముట్టడి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
