 
															పునరావాసంలో ప్రభుత్వం విఫలం
మునగపాక: ముంపు ప్రాంతాల్లో పునరావాసం కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, పార్టీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ విమర్శించారు. గురువారం వారు మునగపాక, రాంబిల్లి మండలాల్లోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం మునగపాక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. మోంఽథా తుపాను తీవ్రత గురించి ముందుగానే తెలిసినా అందుకు అనువుగా లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం పునరావాస కేంద్రాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. రాంబిల్లి, మునగపాక మండలాల్లో పలు చోట్ల పంట పొలాలు ముంపునకు గురైతే అధికారులు ఇచ్చిన గణాంకాలు చూస్తే ఆశ్చర్యంగా ఉందన్నారు. యాదగిరిపాలెంలో ముంపు తీవ్రత ఉంటుందని గ్రహించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విచారకరమన్నారు. ప్రభుత్వం ఊకదంపుడు ప్రచారం చేయడమే తప్ప రైతులను గాని, బాధితులను గాని ఆదుకోవడంలో శ్రద్ధ చూపించలేదన్నారు.
ముంపు ప్రాంతాల్లో పర్యటన
తుపాను కారణంగా ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాలైన యాదగిరిపాలెం, గణపర్తి, చూచుకొండ గ్రామాల్లో గురువారం వైఎస్సార్‌సీపీ నేతలు కరణం ధర్మశ్రీ, బొడ్డేడ ప్రసాద్‌లు పర్యటించారు. ముంపు ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ లోతట్టు ప్రాంతాల్లో ఎందుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటా ఇదే సమస్య తలెత్తుతున్నా అధికారులు రక్షణ చర్యలు చేపట్టకపోవడం సరికాదన్నారు. వారి వెంట మునగపాక, రాంబిల్లి మండలాల జెడ్పీటీసీలు పెంటకోట స్వామి సత్యనారాయణ, దూలి నాగరాజు, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్లు ఆడారి అచ్చియ్యనాయుడు, పిన్నమరాజు కిషోర్‌రాజు, సర్పంచ్‌లు చదరం గణేష్‌నాయుడు, అయినంపూడి విజయభాస్కరరాజు, దొడ్డి సూరప్పారావు, ఎంపీటీసీ కాండ్రేగుల కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
