 
															శారద ఉగ్రరూపం
సాక్షి, అనకాపల్లి: మోంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో కురిసిన వర్షాలతో శారదానది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి 9,056 క్యూసెక్కుల నీరు రైవాడ రిజర్వాయర్‌లోకి చేరడంతో..అధికారులు ముందస్తు ప్రణాళిక లేకుండా ఒక్కసారిగా 9,705 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేయడంతో శారదానది ఉప్పొంగింది. అనకాపల్లి, కశింకోట, మునగపాక, రాంబిల్లి, యలమంచిలి మండలాల్లో దాన్ని ప్రభావం చూపించింది. సుమారుగా ఐదు మండలాల పరిధిలో 20 గ్రామాలపై ప్రభావం చూపించింది. సుమారుగా 5 వేల ఎకరాల వరి పంట, 500 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఆక్వా రైతుల సాగును ముంచేసింది. వై.లోవ గ్రామంలో పడిన గండి 7 గ్రామాల ముంపునకు కారణమైంది. వై.లోవ, రజాల అగ్రహారం, కుమ్మరాపల్లి, మర్రిపాలెం, అప్పన్నపాలెం, కట్టుబోలు, తెరువుపల్లి, మురకాడ, నారాయణపాలెం, చిన్నపాలెం, కొత్తూరు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. మునగపాక మండలంలో చూచుకొండ, యాదగిరిపాలెంలో కిలోమీటరన్నర మేర శారదానది గట్టు వరకూ గురువారం వేకువ జామునే వరద పొంగింది. రాంబిల్లి మండలంలో సుమారుగా 1912 మందిని రాంబిల్లిలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. 5 వేల ఎకరాల వరి పంట నీట మునిగింది. అదేవిధంగా గురువారం కూడా రైవాడ జలశయం నుంచి మరో 5,075 క్యూసెక్కుల నీరు విడుదల చేయడంతో రాత్రికి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నటధికారులు అంచనా వేస్తున్నారు.
కుటుంబాన్ని కాపాడిన ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు
తుపాను ప్రభావంతో శారదానది పరివాహక ప్రాంతంలో రాంబిల్లి మండలంలో కొత్తురు సమీపంలో జలాశయం మద్యలో పామాయిల్ తోట వద్ద ఒక కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు నీటిలో చిక్కుకున్నారు. కె.ప్రసాద్, సువార్త, చందులను ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు కాపాడారు. వారు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ముంపు బాధితులకు పూర్తి సహాయ సహకారాలు : కలెక్టర్
రాంబిల్లి, మునగపాక మండలాల్లో శారదానది పరీవాహక ప్రాంతాల్లో కలెక్టర్ విజయ కృష్ణన్ పర్యటించారు. నీట మునిగిన గ్రామాల ప్రజలతో మాట్లాడి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
