 
															● ప్రమాదాన్ని అంచనా వేయలేకపోయిన అధికారులు ● కొరవడిన అప్
శుక్రవారం శ్రీ 31 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
ఎంత కష్టం: రాంబిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇద్దరు చిన్నారులతో ఓ మహిళ అవస్థ..
వై.లోవ గ్రామం నుంచి
వరద బాధితులను
ఈ కేంద్రానికి
తరలించారు..
రాంబిల్లి (అచ్యుతాపురం):
రాంబిల్లి మండలంలో మేజర్, మైనర్ శారదా నదులకు బుధవారం అర్ధరాత్రి గండిపడింది. బుధవారం తుపాను తీవ్రత తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు ముందున్న గండాన్ని అంచనా వేయలేకపోయారు. వారి అలసత్వానికి భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. రైవాడ జలాశయం నుంచి భారీ ఎత్తున నీటిని విడుదల చేసిన అధికారులు.. అందుకు తగ్గట్టుగా ప్రభావిత ప్రాంతాలను అప్రమత్తం చేయలేకపోయారు. సముద్రతీరానికి ఆనుకొని ఉన్న రాంబిల్లితోపాటు, యలమంచిలి, అచ్యుతాపురం, మునగపాక, కశింకోట మండలాలకు ఆనుకొని ఉన్న శారదా నదీ ప్రవాహ ప్రాంతాల్లో పరిస్థితి చేజారుతుందని గతంలో అప్రమత్తం అయ్యేవారు. కానీ ఇప్పుడు రాంబిల్లి, మునగపాక మండలాల్లో మారుతున్న పరిస్థితిని అధికారులు అంచనా వేయలేకపోయారు. తదనుగుణంగానే మునగపాక మండలంలోని యాదగిరిపాలెం వరద ముంపులోకి వెళ్లిపోయింది. రాంబిల్లి మండలంలోని నారాయణపురం వద్ద మైనర్ శారదా నదికి గండిపడటంతో ఆ ప్రాంత పరిసరాలన్నీ నీటి దిగ్బంధంలోకి వెళ్లిపోయాయి. మేజర్ శారదా నదికి రజాల అగ్రహారం, కొప్పుగొండుపాలెం పరిసరాల్లో గండి పడటంతో సుమారు రెండు వేల ఎకరాలకు పైగా పంట భూములు ,చేపల చెరువులు వరదమయం అయ్యాయి. శారదా నదికి గండి పడిన వైపు ఉన్న మర్రిపాలెం, కట్టబోలు, మురకాడ, తెరువుపల్లి, దిమిలి, నారాయణపురం గ్రామాల పరిధిలోని పంటంతా నీటి పాలవ్వడంతో గురువారం రాత్రి ఎలా గడుస్తుందోనన్న ఆందోళన నెలకొంది.
అప్రమత్తమై ఉంటే..
మైనర్ శారదా నది గట్లు బలహీనంగా ఉన్నాయని అప్పటికే రైతులు ఇసుక బస్తాలు వేసుకొని గట్లను పటిష్టం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో అధికార గణం అప్రమత్తమై ఉంటే కాస్త నష్ట తీవ్రత తగ్గి ఉండేది. నారాయణపురం కెనరా బ్యాంక్ వద్ద పడిన గండి, రజాల అగ్రహారం పరిధిలోని మేజర్ శారదా నదికి పడిన గండితో అధికారుల్లో కలవరం మొదలయ్యింది. సహాయక చర్యలు చేపట్టాల్సిన కొందరు సిబ్బంది దిమిలి పరిసరాల్లో వాహనాల్లో సేద తీరినట్లు కొందరు గుర్తించారు. కొత్తూరు వద్ద నిమ్మతోటలో చిక్కుకుపోయిన ఒక వ్యక్తిని రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందం రంగంలోకి దిగింది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
