 
															పప్పన్నం కరువే.!
● విపత్కర పరిస్థితుల్లోనూ
అందని రేషన్ కందిపప్పు
● 546 మెట్రిక్ టన్నుల సరఫరాకు ప్రభుత్వం ఎగనామం
అనకాపల్లి టౌన్: మోంథా తుపాను లాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా పప్పన్నం దొరుకుతుందేమోనని ఎదురుచూసిన పేదలకు నిరాశే ఎదురైంది. పేదలు పౌష్టికాహారంగా కంది పప్పునే ఎక్కువగా తీసుకుంటారు. అయితే ఈ కందిపప్పు సరఫరాను కూటమి ప్రభుత్వం నవంబర్‌లో కూడా నిలిపివేసింది. దీంతో జిల్లాలోని పేద లబ్ధిదారులపై కోట్లలో భారం పడుతుంది. సామాన్యుల దగ్గర నుంచి ధనవంతుడు వరకూ కందిపప్పును విరివిగా వాడుతుంటారు. అందుకే ధర ఎంతైనా కందిపప్పును కొనుగోలు చేస్తుంటారు. సామాన్యుడు మాత్రం రేషన్ డిపోల్లో లభించే కందిపప్పు కోసం ఆశగా ఎదురు చూస్తుంటాడు. కూటమి ప్రభుత్వం మాత్రం రేషన్ షాపుల్లో కందిపప్పు, రాగులు, గోధుమ పిండి సరఫరా పూర్తిగా నిలిపివేసింది. జిల్లాలో 5,37,038 మంది కార్డుదారులకు 14,99,000 యూనిట్‌దారులు ఉన్నారు. వీరికి ప్రతి నెనా 7,652 మెట్రిక్ టన్నుల బియ్యం, 264 మెట్రిక్ టన్నుల పంచదార, 546 మెట్రిక్ టన్నుల కందిపప్పు, 544 మెట్రిక్ టన్నుల గోధుమ పిండి, 1628 మెట్రిక్ టన్నుల రాగులు సరఫరా చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ నిలిచిపోయాయి. పేదలకు నిత్యావసర వస్తువైన కందిపప్పును సరఫరా చేయలేని ప్రభుత్వం రాగులు, గోధుమ ఇంకేమి ఇస్తుందని లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే రేషన్ షాపుల్లో పూర్తిగా కందిపప్పు సరఫరా నిలిపివేస్తుందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం బియ్యం సరఫరా చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం అర కేజీ పంచదార ఇచ్చి చేతులు దులిపేసుకుంటుంది. బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు ధర నాణ్యతను బట్టి రూ.120పైగా ఉంది. కూటమి నేతలు అధికారంలోకి రాక ముందు రేషన్ షాపులను బలోపేతం చేస్తామని, నిత్యావసరాలైన బియ్యం, పంచదార, కందిపప్పు, గోధుమ పిండి, రాగి పిండి తదితర వాటిని రాయితీపై అందజేస్తామని ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయిలో ఒక్క నెల కూడా సరకులు సరఫరా చేయకపోగా.. విపత్కర పరిస్థితుల్లోనూ చేతులు ఎత్తేయడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
