పునరావాసం.. నిరుపయోగం | - | Sakshi
Sakshi News home page

పునరావాసం.. నిరుపయోగం

Oct 30 2025 8:03 AM | Updated on Oct 30 2025 8:03 AM

పునరావాసం.. నిరుపయోగం

పునరావాసం.. నిరుపయోగం

అచ్యుతాపురం/మునగపాక/నాతవరం: మోంథా తుపాను పునరావాస కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. మౌలిక సదుపాయాలు కల్పించకుండానే హడావుడిగా ప్రారంభించిన కేంద్రాల్లో ఉండేందుకు నిర్వాసితులు ఉండలేక వెంటనే వెనుదిరిగారు. కేవలం ఆర్భాటాలు, గణాంకాల కోసమే ఏర్పాటు చేసిన ఈ పునరావాస కేంద్రాల్లో నిర్వాసితులను పట్టించుకున్న నాథుడే లేకుండా పోయారు. అనేక కేంద్రాల్లో విద్యుత్‌ లేదు. భోజనాలు సరఫరా లేదు. కనీసం మంచినీటి సౌకర్యం కల్పించలేదు. దీంతో నిర్వాసితులు ఈ కేంద్రాలపై కన్నెత్తి చూడలేదు. మోంథా తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తీర గ్రామాల్లోనే కాకుండా ముంపు ప్రాంతాల్లో ఉండే వారిని తరలించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం అధికారులు జిల్లాలో 76 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3902 మందిని తరలించినట్టు చెబుతున్నారు. అయితే వాటిలో వసతులు కల్పించలేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని కేంద్రాల్లో విద్యుత్‌ సౌకర్యం లేదు. కొన్ని పునరావాస కేంద్రాల్లో పందికొక్కులు పడ్డాయి. నిర్వాసితులకు భోజనాల పేరుతో కొంత మంది అధికారులు, సిబ్బంది అడ్డంగా బొక్కేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 3,902 మందిని కేంద్రాలకు తరలించినట్లు చూపిస్తున్నప్పటికీ.. వారిలో చాలామందికి భోజనాలు అందించలేదు. వారికి ఇవ్వాల్సిన భోజనాలు ఏమయ్యాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేంద్రాలకు మరమ్మతులు, సదుపాయాలు, భోజనాలు, ఇతర వసతి సౌకర్యాల పేరుతో గట్టిగానే కొంత మంది అధికారులు, సిబ్బంది వెనకేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నిర్వాసితులకు అందని ఆర్థిక సాయం

ప్రభుత్వం పునరావాస కేంద్రాల్లో ఉండేవారికి రూ.వెయ్యి వంతున అందజేస్తామని చేసిన ప్రకటన ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. తమకు ఇంతవరకు ఉన్నతాఽధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని మునగపాక మండలం రామగిరి వీఆర్వో సాక్షికి తెలిపారు. తుపాను ప్రభావం తగ్గడంతో పునరావాస కేంద్రాల్లో ఉన్న వారంతా తమ ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ప్రభుత్వం నగదు సకాలంలో ఇవ్వకపోవడంతో అధికారులు పునరావాస కేంద్రంలో ఉన్న వారి ఆధార్‌ కార్డు, ఇతర చిరునామా వివరాలు తీసుకుని పంపించేస్తున్నారు. ఈవిషయంపై నాతవరం తహశీల్దార్‌ ఎ,వేణుగోపాల్‌ మాట్లాడుతూ పునరావాస కేంద్రాల్లో ఉన్నవారి వివరాలు సేకరించామని, నివేదిక ద్వారా కలెక్టరు పంపిస్తామన్నారు. ప్రస్తుతం ఎవరికీ డబ్బులు ఇవ్వలేదని, బోజనం మాత్రమే పెట్టామన్నారు.

పలుచోట్ల కాకి లెక్కలు

చంద్రబాబు సర్కారు ప్రచార యావను ఆసరాగా చేసుకొని సందిట్లో సడేమియాలా పలుచోట్ల కాకి లెక్కలతో నిధులు భోంచేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతానికి ఆనుకొని ఉన్న యలమంచిలి నియోజకవర్గ పరిధిలో మోంథా తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని భావించి ఏర్పాటు చేసిన పునరావాసం విషయంలో కాకి లెక్కలు కనిపిస్తున్నాయి. జిల్లా స్థాయి అధికారి నివేదికల మేరకు బుధవారం మధ్యాహ్నం నాటికి నియోజకవర్గంలో 13 పునరావాస కేంద్రాల్లో బాధితులు తలదాచుకున్నట్లు తెలిపారు. 13 పునరావాస కేంద్రాల్లో సుమారు 681 మందికి పునరావాసం కల్పించినట్లు పేర్కొన్నప్పటికీ చాలా కేంద్రాల్లో అందుకు భిన్నమైన పరిస్థితులు సాక్షి బృందాలకు కనిపించాయి. వాస్తవంగా భోజనాలు చేసిన వారి కంటే లెక్కల్లో అధికంగా చూపినట్లు తెలుస్తోంది. అచ్యుతాపురం మండలంలోని రెండు పునరావాస కేంద్రాల్లో సదుపాయాలు నామమాత్రంగానే కనిపించాయి.

మోంథా తుపానుతో జిల్లాలో

76 పునరావాస కేంద్రాల ఏర్పాటు

ఈ కేంద్రాలకు 3,902 మందిని

తరలించినట్లు లెక్కలు

విద్యుత్‌, మౌలిక సదుపాయాలు

లేకుండానే హడావుడి

అనేక చోట్ల భోజనాలు కూడా ఏర్పాటు చేయని అధికారులు

కొన్ని చోట్ల భోజనాలు పక్కదారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement