 
															తాచేరు డైవర్షన్ రోడ్డు మూసివేత
● ఉధృతంగా ప్రవహిస్తున్న నది
● రాకపోకలకు ప్రజలు తీవ్ర అవస్థలు
బుచ్చెయ్యపేట: భీమునిపట్నం–నర్సీపట్నం(బీఎన్) రోడ్డులోని విజయరామరాజుపేట డైవర్షన్ రోడ్డును అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. మోంథా తుపాను కారణంగా తాచేరు నది ఉధృతంగా ప్రవహించడంతో డైవర్షన్ రోడ్డు కోతకు గురైంది. వాహనాల రాకపోకలతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించిన ఇన్‌చార్జి ఎస్‌ఐ పి.మనోజ్‌కుమార్, తహసీల్దార్ లక్ష్మి, తదితరులు డైవర్షన్ రోడ్డుపై నుంచి ఎటువంటి రాకపోకలు లేకుంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మేజర్ పంచాయతీ వడ్డాది డైవర్షన్ రోడ్డు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో ఆర్టీసీ బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో విశాఖ, అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, పాడేరు, తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనచోదకులు నానా అవస్థలు పడ్డారు. కనీసం ఆటో సర్వీసులు కూడా లేకపోవడంతో అత్యవసరంగా ప్రయాణాలు సాగించే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కిలోమీటర్ల దూరం వరకు నడిచి గమ్యస్థానాలకు చేరుకున్నారు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి రవాణా సదుపాయం కల్పించాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
వడ్డాదిలో పూర్తిగా మునిగిపోయిన డైవర్షన్ రోడ్డుపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న నీరు
బుచ్చెయ్యపేట మండలం పేట తాచేరు డైవర్షన్ రోడ్డుకు అడ్డంగా రిబ్బన్‌లు కట్టిన పోలీసులు
 
							తాచేరు డైవర్షన్ రోడ్డు మూసివేత

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
