 
															రిజిస్ట్రేషన్లకు విద్యుత్ కష్టాలు
విద్యుత్ సరఫరా లేకపోవడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద నిరీక్షిస్తున్న జనం
యలమంచిలి రూరల్: తుపాను ప్రభావంతో పలు చోట్ల చెట్లు నేలకొరగడంతో యలమంచిలి పట్టణం, మండలంలోని గ్రామాల్లో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ముందుగా స్లాట్లు నమోదు చేసుకున్న కక్షిదారులు గంటల తరబడి రిజిస్ట్రేషన్ల కోసం నిరీక్షించారు. బాటరీ బ్యాకప్ సరిగ్గా పనిచేయకపోవడంతో కక్షిదారులకు అవస్థలు తప్పలేదు. ఈ కార్యాలయం ద్వారా ఏటా ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి తెచ్చింది. ఈ విధానంతో ఇబ్బందులు పడుతున్నా ప్రజలు భరిస్తున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన సమయంలో ఇబ్బంది లేకుండా జనరేటర్ సౌకర్యం కల్పించాలని కక్షిదారులు కోరుతున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
