 
															జీవీఎంసీలోకి నాలుగు మండలాలు
అల్లిపురం: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) త్వరలో రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా అవతరించనుంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా విభజన అనంతరం మిగిలిపోయిన నాలుగు మండలాలైన భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తిలను జీవీఎంసీలో విలీనం చేసే ప్రక్రియ వేగవంతమైంది. ప్రస్తుతం 98 వార్డులతో ఉన్న జీవీఎంసీ ఈ నాలుగు మండలాల విలీనంతో 120 వార్డులకు విస్తరించనుంది. ఈ విస్తరణతో విశాఖపట్నం భారతదేశంలో 18వ అతిపెద్ద నగరంగా కూడా గుర్తింపు పొందనుంది. భీమిలి నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాలను(భీమిలి, పద్మనాభం, ఆనందపురం) జీవీఎంసీలో కలపాలని అక్కడి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేయగా.. మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు అధికారులు పనులను వేగవంతం చేసినట్లు సమాచారం. ఈ ప్రక్రియలో భాగంగా జీవీఎంసీ అధికారులు విలీనం కానున్న నాలుగు మండలాల పరిధిలోని రెవెన్యూ, గ్రామ పంచాయతీ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విలీన ప్రక్రియలో ప్రభుత్వం జీవీఎంసీకి పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. విలీనమయ్యే ప్రాంతాల్లోని పంట పొలాల విస్తీర్ణంపై అధికారులు ప్రత్యేకంగా సర్వే చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవసాయ భూములకు జీవీఎంసీ పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. సర్పంచుల పదవీకాలం ముగిసే నాటికి, తదుపరి జీవీఎంసీ ఎన్నికల లోపు... భూ సర్వే, గృహాలు, పంట పొలాలు, దేవాలయాలు వంటి అన్ని అంశాలపై సమగ్ర జాబితాలను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ గ్రామ పంచాయతీల్లో గత 14 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్యాలయ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, వాటర్ సప్లై, విద్యుత్ సిబ్బంది, గుర్ఖాలను జీవీఎంసీలోకి తీసుకునేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
