 
															విశాఖ–బొబ్బిలి సెక్షన్‌లో భద్రతా ఆడిట్
తాటిచెట్లపాలెం: వాల్తేర్ డివిజన్ పరిధిలోని విశాఖపట్నం–బొబ్బిలి రైల్వే సెక్షన్‌లో బుధవారం సేఫ్టీ ఆడిట్ జరిగింది. నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేకు చెందిన భద్రతా ఆడిట్ బృందం ఈ తనిఖీలను చేపట్టింది. ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ ఉత్తమ్ ప్రకాష్ నేతృత్వంలో ఈ బృందం సెక్షన్ పరిధిలోని పలు స్టేషన్లలో పాటిస్తున్న భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించింది. పెందుర్తి–కొత్తవలస మధ్య గల మలుపులు, కొత్తవలస స్టేషన్‌లో పాయింట్‌లు, యార్డులు, క్రాసింగ్‌లు, అలమండ–కోరుకొండ మధ్య నిర్మించిన ప్రధాన బ్రిడ్జిలు, బొబ్బిలి స్టేషన్‌లోని రిలేరూం, కోమటిపల్లి యార్డ్, ట్రాక్షన్ సబ్‌స్టేషన్, లెవెల్ క్రాసింగ్ గేట్, కోచింగ్ క్రూ లాబీ, విశాఖపట్నం యార్డులో యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ ఎక్విప్‌మెంట్ వ్యాన్, యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్, న్యూ కోచింగ్ కాంప్లెక్స్, రన్నింగ్ రూంలు, రూట్ రిలే ఇంటర్‌లాకింగ్ కేబిన్‌లను పరిశీలించింది. సీనియర్ రైల్వే అధికారుల పర్యవేక్షణలో వివిధ రైల్వే జోన్‌ల మధ్య ఇటువంటి ఇంటర్ జోన్ సేఫ్టీ ఆడిట్‌లు తరచూ జరుగుతుంటాయని వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. ఆడిట్ ప్రారంభానికి ముందు డీఆర్‌ఎం లలిత్ బోహ్రా డివిజన్ భద్రతా అంశాలను ఆడిట్ బృందానికి వివరించారు. తనిఖీల్లో వాల్తేర్ డివిజన్ ఏడీఆర్‌ఎం(ఆపరేషన్స్) కె.రామారావు, సీనియర్ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్ ఆనంద్‌కుమార్ ముటట్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రైల్వే సేఫ్టీ ప్రమాణాలను పరిశీలించిన
నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే బృందం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
