 
															జలాశయాలకు పోటెత్తిన వరద
దేవరాపల్లి: మోంథా తుపాను ప్రభావంతో జలాశయాలకు వరద నీరు పోటెత్తింది. సోమ, మంగళవారాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి రైవాడ జలాశయంలోకి భారీగా వరదనీరు చేరింది. 3 వేలు క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా.. మూడు స్పిల్‌వే గేట్లను ఎత్తి 2,700 క్యూసెక్కుల నీటిని శారదానదిలోకి విడిచిపెడుతున్నారు. జలాశయం గరిష్ట నీటి మట్టం 114 మీటర్లు కాగా.. ప్రస్తుతం 112.30 మీటర్లకు చేరుకుంది. ఇన్‌ఫ్లో పెరిగితే నీటి విడుదలను మరింత పెంచే అవకాశం ఉన్నందున శారదానది పరీవాహక ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలాశయం డీఈ జి.సత్యంనాయుడు సూచించారు. శారదానది దాటే ప్రయత్నం, నది స్నానాలు చేయొద్దన్నారు. తామరబ్బ వద్ద బ్రిడ్జి అడుగు భాగాన్ని తాకుతూ శారదానది ఉధృతంగా ప్రవహిస్తుంది.
రావికమతం: కల్యాణపులోవ జలాశయాన్ని తహసీల్దార్ అంబేడ్కర్, ఏఈ సూర్య, అధికారులు, సర్పంచ్ వంజరి గంగరాజు మంగళవారం సందర్శించారు. జలాశయం గరిష్ట నీటి మట్టం వివరాలను తహసీల్దార్ అడిగి తెలుసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా మంగళవారం కూడా జలాశయం నుంవి మూడు స్పిల్‌వే గేట్ల ద్వారా 200 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయం గరిష్ట నీటి మట్టం 460 అడుగులు కాగా.. సోమవారం సాయంత్రానికి 458.01 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. ఎగువ పరీవాహక ప్రాంతం నుంచి ఇన్‌ఫ్లో ద్వారా 200 క్యూసెక్కులు వస్తోంది. అదే స్థాయిలో మూడు గేట్లు ద్వారా 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ సూర్య తెలిపారు. చీమలపాడు పంచాయతీ కార్యదర్శి రాజ్‌కుమార్, వీఆర్వో చంటి, తదితరులు పాల్గొన్నారు.
తామరబ్బ బ్రిడ్జిపై నుంచి
ఉధృతంగా గెడ్డ ప్రవాహం
దేవరాపల్లి: మోంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని గిరిజన ప్రాంతంలోని తామరబ్బ బ్రిడ్జి పైనుంచి మంగళవారం రాత్రి గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో తామరబ్బ, సమ్మెద, చింతలపూడి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తామరబ్బ బ్రిడ్జిపై నుంచి మోకాలు లోతున నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది. వెంటనే స్పందించిన అధికారులు, స్థానిక సర్పంచ్‌లు టోకురి రామకృష్ణ, ఉప సర్పంచ్ గుమ్మడపు దేవి మహేష్, తదితర నాయకులు బ్రిడ్జికి ఇరువైపులా ట్రాక్టర్లను అడ్డం పెట్టి రాకపోకలను నిలిపివేశారు.
చింతలపూడి పంచాయతీలోని సుమారు 10 గ్రామాల ప్రజలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గెడ్డ ఉధృతి తగ్గుముఖం పడితే తప్ప ఇక్కడి ప్రజలు దేవరాపల్లి వైపు, దేవరాపల్లి నుంచి చింతలపూడి వైపు వెళ్లే పరిస్థితి లేదు. సమ్మెదలోను కూడా బ్రిడ్జిని తాకుతూ గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తున్నది.
రైవాడ జలాశయం స్పిల్‌వే గేట్ల నుంచి
శారదానదిలోకి విడుదల చేసిన వరదనీరు
దేవరాపల్లి: తామరబ్బ బ్రిడ్జి
వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న శారదా నది
 
							జలాశయాలకు పోటెత్తిన వరద
 
							జలాశయాలకు పోటెత్తిన వరద

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
