పులపర్తి కూడలి వద్ద ట్రాక్టర్ బోల్తా
యలమంచిలి రూరల్: మండలంలోని 16వ నెంబరు జాతీయ రహదారిపై పులపర్తి కూడలి వద్ద ఆదివారం సాయంత్రం అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఆ సమయంలో ట్రాక్టర్ తొట్టెలో యూరియా బస్తాలపై కొందరు రైతులు ప్రయాణిస్తున్నారు. అయితే అదృష్టవశాత్తు వారంతా రోడ్డు పక్కకు పడ్డారు. దీంతో ప్రమాదం తప్పింది. ఈ కూడలి వద్ద బయ్యవరంలో ఉన్న మైహోం సిమెంటు కర్మాగారానికి వెళ్లే భారీ వాహనాలు టర్న్ తీసుకుంటున్నాయి. రోజూ పదుల సంఖ్యలో వాహనాలు ప్రయాణించడంతో జాతీయ రహదారి అంచుల వద్ద గోతులు ఏర్పడ్డాయి. దీంతో ఇక్కడ ప్రయాణించే వాహనాలు రోడ్డు అంచుకు వెళితే ప్రమాదాలకు గురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. జాతీయ రహదారి నిర్వహణ బాధ్యతలు చూస్తున్న అధికారులు పులపర్తి కూడలి వద్ద దెబ్బతిన్న రోడ్డు అంచులకు మరమ్మతు పనులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.


