ఆహ్లాదం ఆధ్యాత్మికం చోడవరం
పవిత్ర స్నానాల రేవుగా ముద్దుర్తి సంగమేశ్వరస్వామి ఆలయం
చోడవరం:
ప్రాచీన దేవాలయాలతోపాటు, ఆహ్లాదకరమైన వన సమారాధన ప్రాంతంగా చోడవరం పరిసరాలు అనేకం ప్రాచుర్యంలోకి ఉన్నాయి. ప్రస్తుతం కార్తీకమాసం కావడంతో అంతా శివాలయాలు దర్శనం, వారాంతం అంతా వనసమరాధన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో అతికొద్ది ప్రాచీన దేవాయాలు, వనసమారాధన (పిక్నిక్ స్పాట్‌లు) కలిగిన ప్రదేశాలు ఉండగా అందులో చోడవరం పరిసర ప్రాంతాలు ఉండటం విశేషం.
ఆలయాల సమాహారం.. వెంకన్నపాలెం
ఆలయాల సమాహారంగా ఉన్న వెంకన్నపాలెం షిర్డిసాయిబాబా ఆలయ ప్రాంతం జిల్లాలో ప్రముఖ పిక్నిక్, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో ఒకటిగా పేరుగాంచింది. పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉండే కొండలు, కోనేరు, పడమటి కొండల మధ్యలో పారే శారదానది సెలయేరు...మామిడి జీడి తోటలు సందర్శకులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. మరో పక్క ఒకే చోట చిన్ని చిన్న కొండలపై షిర్డిసాయిబాబా ఆలయం, శ్రీ కనకదుర్గమ్మ ఆలయం, అతిపురాతన కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం, పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం, శ్రీకృష్ణుని ఆలయాల సమాహారం ఇక్కడ ఆధ్యాత్మిక ప్రదేశంగా భక్తులకు ప్రశాంతతను కలిగిస్తుంది. పిల్లలు పెద్దలు, వృద్ధులు అంతా కలిసి ఒకేచోట ఆనందంగా గడిపేందుకు అనువుగా ఉండే ఈ ప్రాంతం ఒక పక్క ఆథ్యాత్మికంగా మరోపక్క పిక్నిక్ స్పాట్‌గా ఉంది. కార్తీకమాసంలో ఈ ప్రాంతం భక్తులు, సందర్శకులతో సందడిగా ఉంటుంది.
రవాణా సౌకర్యం
విశాఖపట్నం నుంచి చోడవరం వెళ్లే ప్రతి ఆర్టీసీ బస్సు వెంకన్నపాలెం సెంటర్‌లో ఆగుతుంది. అనకాపల్లి నుంచి చోడవరం వెళ్లే బస్సులు ఉన్నాయి. నర్సీపట్నం, మాడుగుల, పాడేరు నుంచి వచ్చే వారు చోడవరంలో దిగి అక్కడ నుంచి విశాఖ, అనకాపల్లి వెళ్లే బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి.
తురుష్కుల కాలం నాటి శివాలయం
ప్రాచీన దేవాలయాల్లో చోడవరం స్వయంభూ శ్రీగౌరీశ్వరస్వామి ఆలయం ఒకటి. 260యేళ్ల కిందట చోడవరం ప్రాంతాన్ని పాలించిన మత్స్యరాజుల కాలంలో భూమిలో వెలుగుచూసిన స్వయంభూ గౌరీశ్వరస్వామి ఇక్కడ దేవుడు. తరుష్కుల రాజుల నాటికాలంలో మత్స్యరాజులపై దండెత్తినప్పుడు ఈ ఆలయాన్ని కూడా శిథిలం చేయాలని భావించి, ఆలయంలో ఉన్న స్వయంభూ గౌరీశ్వరస్వామి శివలింగాన్ని కూడా గుర్రాలతో తొక్కించి ముక్కలు చేశారనేది ప్రతీక. అందుకే ఈ స్వయంభూవుని ఆలయంలో శివలింగం ముక్కముక్కలుగా ఉండి భక్తులకు దర్శనమిస్తుంది. ఏక శిల స్తంభాలతో రాతి మండపాలతో నిర్మించి ఉన్న ఈ స్వయంభూ గౌరీశ్వరస్వామి సందర్శకులకు మంచి అనుభూతి ఇస్తుంది. ఆలయానికి ఆనుకొని పవిత్ర కోనేరు కలిగిన శివాలయాలు జిల్లాలో నాలుగైదు ఉంటే అందులో చోడవరం స్వయంభూ గౌరీశ్వరస్వామి ఆలయం ఒకటి. ఆలయం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మహాశివుడు తపస్సు చేస్తున్న విగ్రహం, అర్ధనారీశ్వరుల నిలువెత్తు విగ్రహాలు ఆలయ ముఖ ద్వారం వద్ద భక్తుల దర్శనార్ధం ఉన్నాయి.
రవాణా సౌకర్యం:
ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటూ విశాఖపట్నం నుంచి ప్రతి 20నిమిషాలకు బస్సు ఉంది. 300, 300సి, గాజువాక నుంచి 311 నంబర్లతోపాటు పాడేరు, మాడుగుల, వెళ్లే బస్సులు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయి. అనకాపల్లి, నర్సీపట్నం ప్రాంతాల నుంచి కూడా నేరుగా బస్సులు ఉన్నాయి. చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో దిగి నడిచి ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు.
మూడు నదుల పవిత్ర సంగమం...
మూడు పవిత్ర నదులు సంగమం అయ్యే ప్రదేశంలో ఉన్న ముద్దుర్తి శ్రీ సంగమేశ్వరస్వామి ఆలయానికి 900 యేళ్లనాటి చరిత్ర ఉంది. చోడవరం మండలం ముద్దుర్తి గ్రామ శివారు నదీ పరివాహకంపై రాతికట్టడంతో నిర్మించిన ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడ పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించేందుకు స్నానఘట్టాలు కూడా ఉన్నాయి. శారదా, పెద్దేరు, బొడ్డేరు నదులు ఒకే చోట కలిసి సంగమంగా ఏర్పడిన ప్రదేశంలో ఈ ఆలయం ఉండడం వల్ల సంగమేశ్వరస్వామిగా ఇక్కడి మహాలింగాన్ని పూజిస్తారు. ఇక్కడ పార్వతి, వినాయక విగ్రహాలు ఉన్నాయి. పూర్తిగా రాతితో నిర్మించిన ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో ఇటీవలే పునర్‌నిర్మించారు. ఆ సమయంలో గోపుర కలశం నుంచి బయల్పడిన నాణాలపై 78 అనే సంఖ్య ఉండడాన్ని బట్టి ఈ ఆలయం అత్యంత పురాతనమైనదిగా చెబుతున్నారు. నిత్య పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్నప్పటికీ పవిత్ర కార్తీక మాసం, శివరాత్రి రోజు, కనుమ పండుగ రోజు ఇక్కడ ఆలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శిస్తారు.
రవాణా సౌకర్యం
చోడవరం–అనకాపల్లి రోడ్డులో ఉన్న ముద్దుర్తి జంక్షన్ వద్ద బస్సు దిగి అక్కడ నుంచి ఆటోలు, ఇతర వాహనాలపై సంగమేశ్వరస్వామి ఆలయానికి చేరుకునేందుకు రవాణా సౌకర్యం ఉంది. అనకాపల్లి, చోడవరం నుంచి వచ్చే భక్తులు ఆ రూట్లలో బస్సు సౌకర్యం ఉంది. విశాఖపట్నం, పాడేరు, నర్సీపట్నం నుంచి వచ్చే భక్తులు వెంకన్నపాలెం జంక్షన్ వద్ద బస్సు దిగి అక్కడ నుంచి ఆటోలపై ముద్దుర్తి సంగమేశ్వరస్వామి ఆలయానికి చేరుకోవచ్చు.
పురాతన ఆలయాలకు ప్రసిద్ధి
కార్తీక వన సమారాధనలకు అనుకూలం
250 ఏళ్లనాటి శైవక్షేత్రం
స్వయంభూ గౌరీశ్వరస్వామి ఆలయం
పవిత్ర స్నానఘట్టంగా ముద్దుర్తి
సంగమేశ్వరస్వామి ఆలయం
ఆహ్లాదం ఆధ్యాత్మికం చోడవరం
ఆహ్లాదం ఆధ్యాత్మికం చోడవరం
ఆహ్లాదం ఆధ్యాత్మికం చోడవరం


