బ్యాటర్ల హోరు.. బౌలర్ల జోరు
న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ విజయం
విశాఖ స్పోర్ట్స్: పీఎంపాలెంలోని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఆదివారం జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విశాఖ గడ్డపై జరిగిన ఈ లీగ్ చివరి మ్యాచ్.. సెమీ ఫైనల్స్‌కు సిద్ధమవుతున్న ఇంగ్లండ్ క్రీడాకారిణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 168 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్ లిన్సే స్మిత్ మూడు వికెట్లు పడగొట్టి కివీస్‌ను దెబ్బతీశారు. అనంతరం 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఓపెనర్ అమీ జోన్స్ (86 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో మరో 124 బంతులు మిగిలి ఉండగానే సునాయాసంగా విజయం సాధించింది. భారీగా తరలివచ్చిన క్రికెట్ అభిమానులు ఇరు జట్లకు మద్దతు తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శించి క్రికెటర్లలో ఉత్సాహం నింపారు.


