‘పోలీసులు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు’
ఎస్.రాయవరం: ఒక వ్యక్తిని వారాల తరబడి నిర్బంధించమని ఏచట్టంలోనూ లేదని రాష్ట్ర హైకోర్టు న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ అన్నారు. నక్కపల్లి రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్‌కు వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న దీక్షా శిబిరాన్ని ఉమ్మడి విశాఖజిల్లా, తూర్పు గోదావరి జిల్లా న్యాయవాదులు బృందం ఆదివారం సందర్శించింది. ఈ క్రమంలో ధర్మవరం అగ్రహారంలో 16 రోజులుగా గృహ నిర్బంధంలో ఉన్న సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజును రాజేంద్రప్రసాద్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించి చాలా తప్పిదం చేస్తున్నారని, ఏ చట్టం ప్రకారం రెండు వారాల పైగా అప్పలరాజు గృహ నిర్బంధం చేశారని ప్రశ్నించారు. న్యాయపోరాటం చేస్తున్న నిరసన కారులకు రాజకీయ పార్తీలు, సంస్థలు మద్దతు ఇచ్చే హక్కు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వెంకటేశ్వరరావు, సురేష్‌కుమార్, చిట్టిబాబు, ఏవై మణి, బి.తులసిదాసు, పూర్ణిమ, బి.సంతోష్, లక్ష్మీ, భాస్కరాచార్యులు, రమణారావు, అప్పలరెడ్డి, సురేష్, కె.రాఘవేంద్ర, సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు పాల్గొన్నారు.


