మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం
చోడవరం: ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరించాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాలతో కలిపి వైఎస్సార్‌సీపీ అందోళన చేపట్టిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్ తెలిపారు. చోడవరం పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ ప్రజాఉద్యమం ప్రచార వాల్‌పోస్టరును ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఆనంతరం విలేకర్లతో మాట్లాడారు. పేద, మెరిట్ విద్యార్థులు చదువుకోవడానికి వీలుగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలన్న కూటమి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాలతో కలిసి వైఎస్సార్‌సీపీ ఉద్యమం చేయాలని తలపెట్టిందన్నారు. ఉద్యమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ చేపట్టడం జరిగిందన్నారు. చెరకు రైతులకు జీవనాధారమైన గోవాడ సుగర్ ఫ్యాక్టరీని మూసివేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, రైతుల బతుకులు నాశనం చేసినట్టేనని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రూ. 89 కోట్ల సాయం చేశామని, ఐదు సంవత్సరాలు నిరాటంకంగా క్రషింగ్ చేసి, రైతులకు సకాలంలో పేమెంట్లు ఇచ్చామని అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏడువాడ సత్యారావు, సంయుక్త కార్యదర్శి దొండా రాంబాబు, జెడ్పీటీసీ పోతల శ్రీనివాస్, ఎంపీపీలు యర్రంశెట్టి శ్రీనివాసరావు, గాడి కాసులమ్మ, పైలా రాజు, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పుల్లేటి వెంకటేశ్, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు బోడ్డేడ సూర్యనారాయణ, చోడవరం పట్టణ అధ్యక్షుడు దేవరపల్లి సత్య, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు ముక్కా మహలక్ష్మినాయుడు, కొల్లిమెల్ల అచ్చిమినాయుడు, దొడ్డి వెంకట్రావు, శరగడం సిమ్మినాయుడు, కంచిపాటి జగన్నాథరావు పాల్గొన్నారు.
మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్


